సర్కారు స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. జూనియర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించనుంది.

సర్కారు స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. జూనియర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వచ్చే కొత్త సంవత్సరం నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించనుంది. స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేలా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. అందులో భాగంగానే 2026-27 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో అల్పహారం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. పేద విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు స్కూళ్లలో హాజరుశాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సుమారు రూ.400కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద వారంలో మూడు రోజులు అన్నంతో తయారుచేసే పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ వంటి వంటకాలను, మరో రెండు రోజులు ఉప్మా వంటి వాటిని అందించాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 24వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిరంతరాయంగా అందుతోంది. తాజాగా దీనికి టిఫిన్ కూడా జత చేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, సుదూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

కేజీబీవీల అప్‌గ్రేడేషన్‌కు కసరత్తు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను(కేజీబీవీ) బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. తద్వారా 10వ తరగతి తర్వాత గ్రామీణ ప్రాంత విద్యార్థినులు చదువు మధ్యలో ఆపివేయకుండా, అదే ప్రాంగణంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుంది. రాష్ట్రంలో మొత్తం495 కేజీబీవీ ఉండగా, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సుమారు 120 కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాదికి పూర్తిస్థాయిలో కేజీబీవీలు అప్ గ్రేడ్ చేసేందుకు సమాయత్తమవుతోంది.

జూనియర్ కాలేజీల్లోనూ మిడ్ డే మీల్స్

పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 1.7 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నది. అలాగే యూనిఫామ్స్ అందించే విషయంపై కూడా ఇంటర్ బోర్డు ఆలోచనలు చేస్తోంది.

Next Story