- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి పోరాటానికి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్
మరోసారి పోరాటానికి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పోరాటానికి దిగింది. ఇప్పటికే జలవివాదాల విషయంలో కేంద్ర స్థాయిలో కొట్లాడుతున్న ప్రభుత్వం.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గోదావరి-బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడింది. చివరకు న్యాయ పోరాటం వరకూ వెళ్లేందుకు సిద్ధపడింది. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పోలవరం-నల్లమలసాగర్ పేరిట మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ మేరకు డీపీఆర్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. దాంతో ఈ ప్రాజెక్టుపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లడం గమనార్హం.
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 32 కింద కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంతో పాటు సంబంధిత సంస్థలపై పిటిషన్ వేసింది. పోలవరం విస్తరణ చేపట్టకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ నీటి వాటాను కోల్పోవడమే కాకుండా.. రాష్ట్ర రైతులకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 80 టీఎంసీల నీటినే కృష్ణా నదికి మళ్లించేందుకు అనుమతి ఉన్నదని పిటిషన్‌లో పేర్కొన్నది. అయితే.. నిబంధనలు అతిక్రమించి ఏపీ ప్రభుత్వం అదనంగా 200 టీఎంసీల నుంచి 300 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నది నిర్వహణ మండలి, పర్యావరణ మంత్రిత్వశాఖల నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని ఆరోపించింది. సీడబ్ల్యూసీ ఇన్ ప్రిన్సిపల్ అనుమతి లేకపోయినా డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో వివరించింది.
నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం
ఒకవేళ ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఆ పిటిషన్‌లో పేర్కొంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి రావాల్సిన నీటి వాటా తీవ్రంగా తగ్గిపోతుందని.. దాంతో సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాల మధ్య ఉన్న విభజన చట్టాలకు ఇది పూర్తి విరుద్ధమని.. రాష్ట్ర ప్రజల మౌలిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని తెలిపింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ప్రక్రియను వెంటనే అడ్డుకోవాలని.. ఆ ప్రాజెక్టుపై వెంటనే స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
గత నెల డీపీఆర్ టెండర్ నోటీసు జారీ
మొన్నటివరకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలనుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తాజాగా.. ‘పోలవరం-నల్లమలసాగర్’ లింక్ ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. అంతేకాకుండా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ను తయారు చేసేందుకు టెండర్ నోటీసును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ నోటీసును విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన విచారణలు నిర్వహించడం, అలాగే భారత ప్రభుత్వ సంస్థల నుండి తప్పనిసరిగా పొందాల్సిన అన్ని చట్టబద్ధమైన క్లియరెన్స్‌లను సంపాదించడం వంటి పనులు ఇందులో ఉన్నాయి. ఈపీసీ టర్న్ కీ సిస్టమ్ పద్ధతిలో ఈ టెండర్లను ఆహ్వానించారు. గత నెల 21న ఈ టెండర్ నోటీసు జారీ చేయగా.. 12 నెలల టైం పీరియడ్‌తో రూ.7.68 కోట్లతో ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతున్నా పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉన్నది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సందర్భంలో ఏపీ ప్రభుత్వం కొత్త పేరుతో మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు ముందుగానే కేంద్రాన్ని అలర్ట్ చేశారు. ఏ పేరుతో వచ్చినా పర్మిషన్లు ఇవ్వరాదంటూ కోరారు. ఆయన విజ్ఞప్తి చేసిన నాలుగైదు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చి డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. దాంతో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.






