ఈ నెల 15 నుంచి ఉద్యోగుల హెల్త్ కార్డులు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద హెల్త్ కార్డులను ఈనెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

ఈ నెల 15 నుంచి ఉద్యోగుల హెల్త్ కార్డులు
X
  • త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ
  • సీఎస్‌తో ఉద్యోగ సంఘాల సమావేశంలో నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద హెల్త్ కార్డులను ఈనెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సమావేశంలో అభిప్రాయపడుతూ, అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

క్యూఆర్ కోడ్ తో..

క్యూఆర్ కోడ్ తో నూతన హెల్త్ కార్డులు మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని వివరాలతో ఈహెచ్సీటీ యాప్ రూపొందించనున్నారు. చికిత్సలకు సీజీహెచ్ఎస్ రేట్లు వర్తింపచేయాలని నిర్ణయించారు. నాలుగు రోజుల్లో నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 943 హాస్పిటల్స్ లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. 2594 ప్రొసీజర్స్ కవర్ కానున్నాయి. నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాలపై చర్చ కోసం ఈనెల 13వ తేదిన సీఈఓతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుతో అన్నీ జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతేక ప్రధాన కార్యదర్శి బీఎండీ.ఎక్కా, ముఖ్యకార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, డీజీ షికా గోయల్, కార్యదర్శలు హనుమంత్ కొండిబా, పాపిరెడ్డి, వాణి తదితర ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు టీఎన్‌జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్, దామోదర్ రెడ్డి (పీఆర్‌టీయూ), చావా రవి (యూటీఎఫ్), శ్రీనివాసరెడ్డి (సెక్రటేరియట్ అసోసియేషన్), వంగా రవీందర్ రెడ్డి (ట్రెసా), సదానంద గౌడ్ (ఎస్‌టీయూ), సైదులు (ఎస్‌టీఎఫ్), దాస్య నాయక్ (క్లాస్-4 ఉద్యోగుల సంఘం), పెన్షనర్ల సంఘ ప్రతినిధులు వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, ఉమాదేవి పాల్గొన్నారు.

Next Story