తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఇక ‘కామన్ బిల్’

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఇక ‘కామన్ బిల్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కాగా, ఇప్పటికే ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న బల్దియా ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్‌లకు సంబంధించి ‘కామన్ బిల్’ తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన చర్యలూ ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా ‘మొబైల్ యాప్’ను రెడీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన చేతులమీదుగానే ప్రారంభించనున్నారు.పై

పైలెట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ పరిధిలో..

‘వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్‌ల కామన్ బిల్’ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ ఏరియాను ఎంపిక చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 19.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇంకా ట్యాక్స్ నెట్‌వర్క్ పరిధిలోని బిల్డింగ్స్ లక్షల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ కేటగిరిలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న భవన యజమానులు వాటర్ బిల్లు, కరెంట్ బిల్లును కమర్షియల్ కేటగిరిలో చెల్లిస్తున్నారని గుర్తించారు. విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంట్ మీటర్లను వినియోగిస్తూ, జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న సుమారు 93 వేల ప్రాపర్టీలను గుర్తించారు. వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాడంతో పాటు టాక్స్ పరిధిలోని మరో 70 వేల భవనాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి నుంచే రూ. 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అధికారుల అంచనా. 360 డిగ్రీల కోణంలో రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వచ్చే ఫలితాల ఆధారంగా ‘కామన్ బిల్’ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురానున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మొబైల్ నెంబర్ల లింకప్‌ సర్వే షురూ

‘కామన్ బిల్’ కోసం జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్లు, టీజీఎస్పీడీసీఎల్ మీటర్ రీడర్లు సంయుక్తంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సర్క్యూలర్ జారీచేశారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు విద్యుత్ వినియోగదారుల మొబైల్ నెంబర్లను, జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటీఐఎన్)తో అనుసంధానం చేయాలని గడువు విధించారు. మొబైల్ నెంబర్ల మ్యాపింగ్ బాధ్యతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని, గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. టెక్నాలజీని వాడి వసూళ్లను కచ్చితంగా రాబట్టాలన్నదే ప్రధాన ఉద్దేశం.

జీహెచ్ఎంసీపై విమర్శలు

కరెంట్ ఎన్ని యూనిట్లు వాడుకుంటే అంత బిల్లు చెల్లిస్తున్నారు. వాడుకున్న నీటికే వాటర్ బిల్లు చెల్లిస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు చెల్లించాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పౌరసమాజం నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ‘మా ఇంటికి తాగడానికి నీళ్లు, డ్రైనేజీ సేవలను జలమండలి అందిస్తోంది. దానికి బిల్లు కడు తున్నాం. విద్యుత్ సరఫరాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ చేస్తోంది.. వారికి బిల్లు కడుతున్నాం. జీహెచ్ఎంసీ మాకేం సర్వీస్ ఇస్తుందని వేలల్లో ఆస్తి పన్ను వసూలు చేస్తోంది?’ అని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వీధి కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలూ లేకపోలేదు. ‘రోజుకో చోట పసిపిల్లలు, వృద్ధులు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. వరుస విషాదాలు జరుగుతున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. కుక్కల నివారణకు చర్యలు లేవు, స్టెరిలైజేషన్ ప్రక్రియ నామమాత్రమే. శానిటేషన్ అస్తవ్యస్తంగా మారడంతో దోమల బెడద పెరిగిపోయింది. నగరంలో కొత్తగా నిర్మించిన గ్రంథాలయాలు లేవు. యువత చదువుకోవడానికి, వృద్ధులు సేద తీరడానికి సరైన వసతులు లేవు. ఉన్న పార్కుల సుందరీకరణను ఎప్పుడో గాలికి వదిలేశారు.’ అని ప్రజలు విమర్శిస్తున్నారు. చెరువుల పరిరక్షణను అసలే పట్టించుకోవడంలేదని, ప్రాపర్టీ ట్యాక్స్ ముక్కు పిండి వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని, కామన్ బిల్ ద్వారా ఎందుకు ట్యాక్స్ చెల్లించాలని పలువురు ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Next Story