మందుబాబులకు షాక్: కిక్కు దిగిపోయేలా ధరల పెంపు!

by Gantepaka Srikanth |

లిక్కర్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చే చాన్స్ ఉన్నది. ఈ మేరకు ఎక్సయిజ్ శాఖకు సర్కారు సంకేతాలు పంపినట్టు సమాచారం.

మందుబాబులకు షాక్: కిక్కు దిగిపోయేలా ధరల పెంపు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చే చాన్స్ ఉన్నది. ఈ మేరకు ఎక్సయిజ్ శాఖకు సర్కారు సంకేతాలు పంపినట్టు సమాచారం. ధరల కమిటీ డిస్టలరీల నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను పరిశీలించే పనిలో నిమగ్నమైనట్టు తెలిసింది. ప్రస్తుత ఉత్పత్తి, వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం బ్రాండ్స్ పుల్ బాటిల్‌పై రూ.100 వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పెరుగుతున్న ఒత్తిళ్లు..

రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి లిక్కర్ ధరలు పెంచడం సాధారణంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ హయంలో 2023 మేలో రేట్లు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఏడాది 2025 మేలో లిక్కర్ రేట్లను సవరించాలని కంపెనీలు ఒత్తిడి పెట్టాయి. కానీ కొంత కాలం ఆగాలని ప్రభుత్వం సూచించడంతో మౌనంగా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా మద్యం బాటిల్స్ తయారీ‌పై తీవ్ర ప్రభావం పడింది. బాటిల్స్ తయారీ కోసం ఉపయోగించే గ్యాస్ ధరలు, మద్యం ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో కంపెనీలు మధ్యం ధరలు పెంచాలని ఒత్తిడి చేస్తున్నాయి.

వచ్చేవారం కమిటీ తొలి భేటీ..

ధరల నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ వచ్చేవారం తొలి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ సమావేశంలో లిక్కర్ కంపెనీల నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను కమిటీ సమీక్షించనుంది. ప్రస్తుతం లిక్కర్ ఉత్పత్తి కోసం కంపెనీలు చేస్తున్న ఖర్చు, ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను పరిశీలించి ధరల పెంపుపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనున్నది. కంపెనీలు మాత్రం ధరలు పెద్ద ఎత్తున పెంచాలని కోరుతున్నాయి. వారి డిమాండ్ మేరకు ధరలను పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, దానితో పాటుగా గుడుంబా ఉత్పత్తికి ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకని మధ్యేమార్గంగా సాధారణ బ్రాండ్స్‌కు చెందిన పుల్ బాటిల్‌పై రూ.60 వరకు, ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై ధర రూ.100 వరకు, ఆ పై కేటాగిరీ బ్రాండ్స్‌‌పై రూ.120 వరకు పెరిగే అవకాశం ఉందని ఎక్సయిజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

ప్రతినెలా రూ.250 కోట్ల అదనపు ఆదాయం..

మద్యం ధరల పెంపుతో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇటు సర్కారుతో పాటు అటు కంపెనీలకూ అదనపు ఆదాయం వచ్చేలా ధరలను నిర్ణయించాలని ఆలోచిస్తున్నది. అందుకోసం కమిటీకి ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రతినెలా రూ.250 కోట్లు, ఏడాదికి సుమారు రూ.3 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరేలా ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Next Story