పంచాయతీరాజ్ శాఖలో కొత్త వ్యవస్థ..త్వరలో జీపీకి బుక్ లెట్

by velandi.Saikiran |

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

పంచాయతీరాజ్ శాఖలో కొత్త వ్యవస్థ..త్వరలో జీపీకి బుక్ లెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక డ్యాష్‌బోర్డుతోపాటు ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబందించి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.దాన కిషోర్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. డ్యాష్‌ బోర్డు ద్వారా ప్రతి పథకం పురోగతి, జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఏ ప్రాంతంలో పనులు నెమ్మదిగా సాగుతున్నా వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్‌లో ఐటీ, డేటా నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం పనిచేస్తుంది. ఈ బృందం ప్రతిరోజూ పథకాల అమలును సమీక్షించి, అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.

మంత్రి సీతక్క సూచనలతో..

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచనల మేరకు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ, పారదర్శ సేవలు, జవాబుదారీతనం, సకాలంలో సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవల అందించే లక్ష్యంగా పని చేయనున్నారు. గ్రామసభల్లో ప్రజలు తెలిపిన సమస్యలను త్వరగా పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల అమలును రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడనుంది.

జీపీ బుక్ లెట్..

దీంతో పాటు గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు మౌలిక వసతుల వివరాలను ఒకేచోట సమగ్రంగా అందుబాటులో ఉంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామ పంచాయతీ బుక్‌లెట్’ రూపొందించేందుకు చర్యలు ప్రారంభించింది. బుక్‌లెట్ రూపకల్పన, శిక్షణ కార్యక్రమాలు, ఐటీ వ్యవస్థ అభివృద్ధి కోసం సీనియర్ అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ప్రత్యేకంగా ఫార్మాట్ ప్రిపరేషన్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ, ఐటీ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న అన్ని పథకాలు, మౌలిక వసతులు, వ్యక్తిగత, సామూహిక ప్రయోజనాలు, ప్రజలకు అందుతున్న సేవల వివరాలను సమగ్రంగా పొందుపరిచే విధంగా బుక్‌లెట్ రూపొందించనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో బుక్‌లెట్ ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story