- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరిగిన మార్కెట్ విలువలు, రైతుకు లాభం.. సర్కారుకు భారం
రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణ పూర్తయింది. క్యూర్, ప్యూర్ పరిధిలో భారీగా ధరలను పెంచారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణ పూర్తయింది. క్యూర్, ప్యూర్ పరిధిలో భారీగా ధరలను పెంచారు. అయితే దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ వైపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉండగా.. మరోవైపు వివిధ ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణ కోసం భారం పడుతుందనే చర్చ జరుగుతున్నది. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో సౌత్ సైడ్ భూసేకరణకు ఇప్పటికీ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఈ క్రమంలోనే కొత్త మార్కెట్ ధరల ప్రకారమే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అదే నార్త్ సైడ్ భూ బాధితులకు మాత్రం పాత ధరలే వర్తిస్తాయి. దానికి కారణం నోటిఫికేషన్ నాటి మార్కెట్ విలువల ప్రకారమే లెక్కిస్తారు. ఈ రెండింటి మధ్య వైరుధ్యాలతో భూ సేకరణ ప్రక్రియ నడవనున్నది. ఈ విలువల సవరణ ప్రాజెక్టు వ్యయాన్ని డబుల్ చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. భూ సేకరణ ప్రక్రియలోనే అనుకున్న దాని కంటే మూడింతలు పెరగడం ఖాయం. ఇది ప్రభుత్వానికి గుదిబండగా మారనున్నదన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తున్నది. అలాగే మిగతా ప్రాజెక్టుల కోసం భూ సేకరణ కూడా భారం కానున్నది.
ఇక కష్టమే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల కింద భూ సేకరణ పేరిట వేలాది ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నది. నష్టపరిహారం చెల్లింపుల్లో రిజిస్ట్రేషన్ విలువకు మూడింతలంటూ లెక్క కట్టింది. ఇక భూ సేకరణ ప్రక్రియ దాదాపు ముగిసిందనుకున్న తర్వాతే మార్కెట్ విలువలను పెంచింది. ఏడాదికోసారి సవరించాలని మార్కెట్ వ్యాల్యూస్ సవరణ రూల్స్ చెబుతున్నాయి. కానీ ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ తొలిసారి రిజిస్ట్రేషన్ విలువలను పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజులపై అధ్యయనం చేశామంటూ స్టాంప్ డ్యూటీని ఆరు నుంచి 7.5 శాతానికి పెంచారు. అలాగే మిగతా అన్ని రకాల డీడ్స్ కి స్టాంప్ డ్యూటీని పెంచారు. అయితే అప్పట్లో సబ్రిజిస్ట్రార్లు, తహశీల్దార్ల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్తీసుకోకుండానే ఉన్నతాధికారులే ధరలను నిర్ణయించారన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ ఏడాది తిరగక ముందే మరోసారి సవరించారు. నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల భారీగా రేట్లు పెంచింది. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి దాకా ఎకరం రూ.2.75 లక్షలుగా ఉన్నది రూ.10 లక్షలు చేశారు. అంటే నష్టపరిహారం ఎకరానికి రూ.8.25 లక్షల వంతున ఇవ్వాల్సింది, ప్రస్తుతం అది రూ.30 లక్షలు దాటనున్నది. మార్కెట్ విలువల పెంపు ప్రభుత్వంపైనా భారం అమితంగా పడనున్నది. ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు కోసం సేకరించనున్న భూములకు చెల్లించాల్సిన నష్టపరిహారం పెరుగుతుంది. అమాంతంగా భూ సేకరణకు మూడింతలు ఖర్చు పెరుగుతుందని అంచనా. ఈ ట్రిపుల్ ఆర్ రూ.కోట్లల్లో పలుకుతున్న భూములు ఉండే ప్రాంతం నుంచే వెళ్తుండడం గమనార్హం. మార్కెట్ విలువకు మూడింతలు ఇవ్వాల్సి వస్తే అదే జరగనున్నది. అయితే అది బహిరంగ మార్కెట్ తో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు పెంచిన ధరలతో నష్టపోయే రైతులకు కాస్త ఉపశమనం కలుగుతుంది.
నార్త్, సౌత్.. వ్యత్యాసం
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో నార్త్ సైడ్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతోఅక్కడ పాత రేట్లతో నష్టపరిహారం చెల్లించడానికి అవకాశం ఉంది. అదే సౌత్ సైడ్ ప్రతిపాదిత భూముల వివరాలతో కూడిన ప్రిమిలిమినరీ నోటిఫికేషన్ పూర్తి కాలేదు. కేవలం మ్యాపులను, వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో మాత్రమే పొందుపరిచినట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు. అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి మార్కెట్ వ్యాల్యూస్ ఆధారంగానే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అయితే నార్త్ సైడ్ భూములు కోల్పోయిన వారు అన్యాయానికి గురైనట్లుగా భావిస్తారు. నాలుగేండ్ల తర్వాత రివిజన్ చేశారు. దీనిపై నష్టపోయిన రైతులు న్యాయం పొందే హక్కు ఉంటుందని న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. అంటే ప్రతి ఏటా పెంచాల్సిన రేట్లను నాలుగేండ్ల తర్వాత పెంచడం ద్వారా నష్టపోయినట్లు కోర్టుకు మొర పెట్టుకోవడం ద్వారా న్యాయం పొందొచ్చునన్నారు.
ఎంత విస్తరిస్తే అంత భారమే
దేశ వ్యాప్తంగా ఉన్న ఎక్స్ ప్రెస్ వేలతో పోలిస్తే ట్రిపుల్ ఆర్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రధాన కూడళ్లు భిన్నంగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అన్నింటి కంటే పెద్దగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఔటర్ రింగు రోడ్డులో భాగంగా నిర్మించిన క్లవర్ లీఫ్ ఇంటర్ చేంజర్స్ తో పోలిస్తే రీజినల్ రింగ్ రోడ్డు ప్రధాన కూడళ్లు మరింత భారీగా, ఆధునికంగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మితం కానున్నది. కానీ రానున్న రోజుల్లో ఎనిమిది లైన్లకు విస్తరించవచ్చునన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్ చేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ఇంటర్ చేంజ్ సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయంటే వాటి పరిమాణం ఎంత భారీ స్థాయిలో ఉండనుందో అంచనా వేయొచ్చు. నేషనల్, స్టేట్ హైవేలను క్రాస్ చేసేందుకు వంద మీటర్ల వెడల్పుతో రీజినల్ రింగ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తున్నారు. క్రాసింగ్స్ దగ్గర ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ట్రిపుల్ ఆర్ వైపుకి వాహనదారులు రావడానికి, అక్కడి నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు క్లవర్ లీఫ్ ఇంటర్ చేంజర్స్ అవకాశం కల్పిస్తాయి. అంతే కాదు సర్వీసు రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా ఈ ఇంటర్ చేంజెస్ నిర్మించనున్నారు. వీటన్నింటికీ రైతుల నుంచి సేకరించాల్సిన భూములకు భారీగానే వడ్డించాల్సి ఉంటుంది.
అధికారులు చెప్పినా..
హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల మార్కెట్ వ్యాల్యూస్ రివిజన్ సమయంలో ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూస్, ప్రివెయిల్ మార్కెట్ వ్యాల్యూస్ తో కూడిన రిపోర్టులను అధికారులను అడిగారు. ఈ సందర్భంగానే కలెక్టర్లతో కొందరు అధికారులు భూ సేకరణ సమస్యగా మారుతుందని గుర్తు చేశారు. దాంతో మొదట ప్రివెయిలింగ్ (ఓపెన్ మార్కెట్ వ్యాల్యూస్) ని తక్కువగా వేసి ఇచ్చారు. దానికి తోడు జిల్లా రిజిస్ట్రార్లు ఎక్కడైనా గరిష్టంగా 100 శాతం కంటే ఎక్కువగా పెంచే యోచన లేదన్నారు. అయితే ఓపెన్ మార్కెట్ వ్యాల్యూస్ ని తగ్గించి చూపించి సమర్పించిన రిపోర్టులను ఉన్నతాధికారులు రిజెక్ట్ చేశారని తెలిసింది. భూ సేకరణ ప్రక్రియ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాస్తవంగా బహిరంగ మార్కెట్ లో ఏ మేరకు రేట్లు ఉన్నాయో అంతా వేసి రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. దాంతో ఎకరం రూ.2.75 లక్షలు మార్కెట్ వ్యాల్యూ ఉన్న ప్రాంతాల్లోనూ రూ.50 లక్షల వరకు పలుకుతున్నట్లుగా ఇచ్చారు. దాంతో ఇప్పుడా భూముల రేట్ల మార్కెట్ వ్యాల్యూ రూ.10 లక్షలకు చేరింది. ఇప్పుడు పెరిగిన రేట్లతో ప్రభుత్వానికి చాలా భారమని రెవెన్యూ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.






