- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం
నగరంలోని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో కరవైన ఫైర్ సేఫ్టీ.. ఇరుకు గదుల్లో నిరుద్యోగుల ప్రాణాలు గాల్లో దీపం.. తనిఖీలను గాలికొదిలేసిన అధికారులు!

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. భవిష్యత్‌పై కొండంత ఆశతో ఎంతో మంది భాగ్యనగరం బాటపడుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారు. కానీ, అనేక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరం అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో తమ పిల్లలను కోచింగ్ సెంటర్లలో చేర్పించిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వందల్లో కోచింగ్ సెంటర్లు..
హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో వేల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. చాలా సంస్థలు అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకొని తరగతులు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల రెంట్ తక్కువని ఎప్పుడో నిర్మించిన పాత భవనాల్లో క్లాసులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా కోచింగ్ సెంటర్లకు కనీసం రాకపోకలు సాగించే సరైన దారి కూడా లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్ కూడా వెళ్లలేని సెంటర్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో దశాబ్దాల కిందట నిర్మించి, ప్రస్తుతం డేంజర్‌లో ఉన్న బిల్డింగుల్లో వ్యాపారాలూ, స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయి.
ప్రైమరీ ఫైర్ సేఫ్టీ పరికరాల్లేవ్..
నగరంలో ప్రస్తుతం నడుస్తున్న చాలా కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో ప్రైమరీ ఫైర్ సేఫ్టీ పరికరాలు కనిపించడం లేదు. ఎక్కువ పురాతన భవనాల్లో నడుస్తుండటంతో.. వాటికి వాడిన కరెంటు సామాన్లు పాతబడ్డాయి. మరోవైపు ఏసీలు, లైట్లు, ఎలక్ట్రిక్ పరికరాలు ఎక్కువగా వాడటంతో లోడ్ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఆడిట్ ఊసేలేదు. అనేక భవనాలకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే.. ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఫైర్ సేఫ్టీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రైవేట్ హాస్టళ్ల పరిస్థితి మరీ దారుణం..
కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు, కాలేజీల విషయం అలా ఉంటే.. ప్రైవేట్ హాస్టళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పిచ్చుక గూళ్ల లాంటి గదుల్లో నలుగురు నుంచి ఆరుగురిని ఉంచుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.7000 నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో 3 డబుల్ బెడ్రూంలు ఉన్న ఓ భవనంలో 30 మందికి పైగా ఉంటున్నారు. అదే భవనంలో కింద వంట చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా అనుకోని ఘటన జరిగితే కనీసం తొందరగా కిందకు దిగడానికి సరైన దారి లేదు. ఎక్కి దిగే మెట్లు కూడా ఇరుగ్గా ఉన్నాయి. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి హాస్టళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని తనిఖీ చేసిన నాథుడే లేడు.
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు ఇలా..
ఎన్‌డీఎంఏ వార్నింగ్..
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) దేశవ్యాప్తంగా ఎన్నో స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు ముప్పు ఉందని ఇటీవలే వార్నింగ్ ఇచ్చింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫలితంగా ఎంతమంది అగ్నికి ఆహుతవుతున్నారు. మన దేశంలో ఏడాదికి దాదాపు 13 వేల నుంచి 15 వేల మంది అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. కేవలం రెండేళ్ల కాలంలో ఢిల్లీలోని విద్యాలయాల్లో 190 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఢిల్లీలోనే కాదు.. ముంబయి, కోల్‌కత్తా, చెన్నై వంటి నగరాల్లోనూ ఎన్నో ప్రమాదాలు జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.






