- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవర్‌లోడ్‌కు చెక్.. ఇక కఠిన చర్యలే! మైనింగ్, రవాణాశాఖ అధికారులకు మార్గదర్శకాలు ఇవే
వాహనాల్లో పరిమితికి మించి సరుకులు, ఖనిజాలను లోడ్ చేయడం, రవాణా చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వాహనాల్లో పరిమితికి మించి సరుకులు, ఖనిజాలను లోడ్ చేయడం, రవాణా చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని లోడింగ్ పాయింట్ల ఇన్‌చార్జులు, జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా రవాణా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పలు క్వారీలు, కంపెనీలు, లోడింగ్ పాయింట్లు వాహనాల నిర్ణీత పరిమితికి మించి సరుకులను లోడ్ చేస్తున్నట్టు గుర్తించింది. అంతేకాకుండా ఓవర్ లోడింగ్ వే బిల్లులు, ట్రాన్సిట్ పర్మిట్లు సైతం జారీచేస్తున్నట్టు తేలింది. ఈ చర్యలు మోటారు వాహనాల చట్టం-1988, మైనింగ్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. సెక్షన్ 113 (మోటారు వాహనాల చట్టం, 1988) ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ)లో పేర్కొన్న గ్రాస్ వెహికల్ వెయిట్(జీవీడబ్ల్యూ) కంటే ఎక్కువ బరువు ఉన్న లోడ్‌తో ఎలాంటి వాహనాన్ని నడపకూడదు, అనుమతించకూడదు. సెక్షన్ 194 ప్రకారం ఓవర్‌లోడ్ వాహనాన్ని అనుమతించడం లేదా నడపడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 199 మేరకు ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై ఈ సెక్షన్ కింద బాధ్యతలను నిర్దేశిస్తూ చట్టపరమైన చర్యలు ఉంటాయి.
లోడింగ్ పాయింట్ ఇన్‌చార్జులకు ఆదేశాలు
ఏ వాహనంలోనూ దాని ఆర్సీలో అనుమతించిన జీవీ డబ్ల్యూ కంటే ఎక్కువ లోడ్ చేయకూడదని రవాణా శాఖ స్పష్టం చేసింది. నిర్ణీత పరిమితులను ఉల్లంఘించి లోడింగ్‌కు పాల్పడే యజమానులు, బాధ్యులపై నేరుగా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అనుమతించదగిన పరిమితి కంటే అదనంగా ఉన్న ఖనిజ పరిమాణానికి ఎలాంటి రాయల్టీని అంగీకరించకూడదని మైనింగ్ శాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. పరిమితికి మించిన బరువుకు ట్రాన్సిట్ పర్మిట్లు లేదా రసీదులను జారీచేయకూడదని స్పష్టం చేసింది. అదనపు పరిమాణానికి పర్మిట్లు ఇవ్వడం లేదా రాయల్టీని స్వీకరించడం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది.
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా రవాణా అధికారులు తమ పరిధిలోని అన్ని కంపెనీలు, క్వారీలు, లోడింగ్ పాయింట్లు, మైనింగ్ శాఖ అధికారులకు ఈ ఆదేశాలను రవాణా సిబ్బంది ద్వారా చేరవేయాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నివేదికను వెంటనే రవాణా కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను రవాణా శాఖ, మైనింగ్ శాఖ అధికారులు, లోడింగ్ పాయింట్ ఇన్‌చార్జులు కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది.






