- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంవో ప్రక్షాళన.. త్వరలో మరికొందరిపై వేటు!
సీఎంఓ ప్రక్షాళన, అజిత్ రెడ్డిపై బదిలీ వేటు.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ నియామకం.. సలహాదారుడిగా మాజీ సీఎస్ రామకృష్ణారావు!

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి తన ఆఫీసులో పనితీరు సరిగా లేని అధికారులను పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా తనకు సన్నిహితుడైన అధికారిగా ముద్రపడిన అజిత్‌రెడ్డిని సీఎంవో నుంచి తప్పించారు. డిఫెన్స్ సర్వీసుకు చెందిన అజిత్‌కు సీఎం ఏరికోరి తన ఆఫీసులో కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆయన పనితీరు లేకపోవడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తొలగించినట్లు తెలుస్తున్నది. త్వరలో ఒకరిద్దరు సీఎం కార్యదర్శులపై సైతం వేటు పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈనెల 30న చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావును సీఎంవో ఆఫీసులో ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా నియమించారు.
అజిత్‌పై ఫిర్యాదుల చిట్టా..
సీఎంవో ఆఫీసును గతంలోనే ఒకసారి ప్రక్షాళన చేశారు. ఏడాది క్రితం సీఎం సెక్రటరీలుగా పనిచేస్తున్న సంగీతా సత్యనారాయణ, షానవాజ్ ఖాసీంను బదిలీ చేశారు. తాజాగా అజిత్‌రెడ్డిని సీఎం సెక్రటరీగా తొలగించి, పరిశ్రమల శాఖ పరిధిలోని ఇన్వెస్టిమెంట్ విభాగానికి సీఈవో గా నియమించారు. ఆయన పై బదిలీ వేటు పడటం వెనుక ఆయన వ్యవహార శైలి కారణం అని తెలుస్తున్నది. అటు సొంత పార్టీ నేతలు, ఇటు అధికారులు ఫిర్యాదులు చేయడంతో తప్పించినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. డిఫెన్స్ సర్వీసుకు చెందిన అజిత్ చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరిస్తారని అంచనాతో సీఎం ఆయనను తన ఆఫీసులో నియమించుకున్నారు.
కానీ సివిల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం లేకపోవడం, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏ విధంగా వ్యవహరించాలో తెలియకపోవడం కారణంగా వివాదాస్పదుడిగా ముద్రపడినట్లు ప్రచారం ఉంది. మంత్రులు ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడకపోవడం, ఎమ్మెల్యేలు కలిసేందుకు ఆఫీసుకు వెళ్లినా స్పందించకపోవడంతో పాటు చులకనగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. సమయం చూసుకుని సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అఫీసర్ల పట్ల కూడా ఆయన దురుసుగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి తోడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు బెడిసికొట్టాయి. ప్రధానంగా కంచ గచ్చిబౌలి భూములను చదును చేసే విషయంలో తలెత్తిన వివాదానికి ఆయన ప్రధాన కారణమనే చర్చ అప్పట్లో జరిగింది.
త్వరలో ఒకరిద్దరి పై బదిలీ వేటు..!
ఈనెల 30న చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావును సీఎం సలహాదారు తో పాటు సీఎంవోలో ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాతో నియమించడంతో ఆయన కీలకంగా మారుతారని టాక్ ఉంది. ముఖ్య నిర్ఱయాలు, పథకాల అమలుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతోపాటు మెట్రో రైలు విస్తరణ పనుల బాధ్యతలను సీఎం ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. అయితే త్వరలో సీఎంవోలో ఒకరిద్దరు సెక్రటరీలను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ అజెండా కంటే సొంత అజెండాతో నిర్ణయాలు తీసుకునే ఆఫీసర్లను పక్కన పెడుతారని సమాచారం.
సీఎంవోలో తెలంగాణ అధికారి..
సంగీత సత్యనారాయణను బదిలీ చేసిన తర్వాత సీఎం ఆఫీసులో తెలంగాణకు చెందిన అధికారులు లేరని విమర్శలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎన్.శ్రీధర్‌ను సీఎంవోలోకి తీసుకుని ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆయన సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా పనిచేసిన సమయంలో శ్రీధర్ సీఎం సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆయన బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ కాలం సింగరేణిలో పనిచేశారు. ఆ పార్టీకి చెందిన నాయకులతో ఇప్పటికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.






