TG: సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి

by Gantepaka Srikanth |

TG: సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి

TG: సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 3000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను 5 సంవత్సరాల పాటు దశలవారీగా కొనుగోలు చేయడానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఎంస్ నం.42ని జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 19న జరిగిన తెలంగాణ పవర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పునరుత్పాదక వినియోగ బాధ్యత (ఆర్సీఓ) లక్ష్యాలను చేరడంలో లోటు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 2030 నాటికి దాదాపు 12,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి అవసరం ఉంటుందని అధ్యయనాలు సూచించాయి. ఈ నేపథ్యంలో టీజీరెడ్కో ప్రతిపాదించిన సౌర విద్యుత్ కొనుగోలు ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీజీ డిస్కంలకు 3000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

టీజీరెడ్కోకు టెండర్లు, బిడ్డింగ్ సహా మొత్తం కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టం (ఐఎస్టీఎస్), ఇంట్రా స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టం (ఐఎన్ఎస్టీఎస్) ద్వారా సాంకేతికంగా, వాణిజ్యపరంగా ఉత్తమమైన మోడల్ ద్వారా కొనుగోలు చేయాలని సర్కారు ఆదేశించింది. 2026 జూన్ నాటికి 1000 మెగావాట్లు, 2026 డిసెంబర్ నాటికి 1000 మెగావాట్లు, 2027 జూన్ నాటికి 1000 మెగావాట్లను దశలవారీగా కొనుగోలు చేపట్టాలని షెడ్యూల్ నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ వ్యవస్థలో గ్రీన్ ఎనర్జీ శాతం పెరిగి, రాష్ట్రం చేపట్టిన తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్యాలకు బలమైన పునాదులు పడనున్నాయి. అదనంగా, భవిష్యత్‌లో స్థిరమైన, తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా కోసం ఈ చర్యలు కీలకంగా నిలుస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Next Story