- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల డెడ్‌లైన్
ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్నకు, అలాగే కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌కు సమ్మె నోటీసును జేఏసీ నాయకులు అందజేశారు. మొత్తం 31 డిమాండ్లతో ఈ సమ్మె నోటీసును సమర్పించినట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని, 2017 పీఆర్‌సీ అమలు చేసి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, 2021 పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, కార్మికులపై విధించిన శిక్షలను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జెసి వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కోరారు.
డ్యూటీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను చెల్లించడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలు ఇవ్వడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి వంటి డిమాండ్లను కూడా నెరవేర్చాలని ప్రస్తావించారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మార్చి 26 నుంచి సమ్మె ప్రారంభిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. జేఈసీ కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






