తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్టుకు పునర్జన్మ.. రెండుప్లాన్లతో సర్కారు రెడీ!

by Naga Rani Yarlagadda |

గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన పెట్టింది.

తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్టుకు పునర్జన్మ.. రెండుప్లాన్లతో సర్కారు రెడీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలని కృతనిశ్చయంతో ఉన్నది. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని ఎన్నికలకు ముందు సైతం చెప్పుకొచ్చింది. అంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటుకు గురికావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రక్రియను వేగవంతం చేసింది.

రెండు రకాల ప్లాన్‌లు సిద్ధం

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహితను 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు ఇప్పటికే అంగీకరించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 150 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు అంగీకరించాలని మహారాష్ట్రను కోరుతున్నది. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీంతో 149 మీటర్ల వరకైనా ఒప్పించాలని ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే.. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహితకు నీటిని తరలించేందుకు రెండు రకాల ప్లాన్‌లను సిద్ధం చేయించింది. ప్లాన్ ఏ, ప్లాన్ బీలతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే పూర్తిచేసింది. సాండ్, ఇతర టెక్నికల్ అంశాలపై ఈ సర్వే చేపట్టింది. ప్లాన్ ఏ ప్రకారం తుమ్మిడిహెట్టి నుండి సుందిళ్లకు.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని భావిస్తున్నది. ఇక ప్లాన్ బీ ద్వారా తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి నీటిని తరలించాలని మరో ప్రణాళికను సిద్ధం చేసింది. ఇలా చేయాలంటే మధ్యలో ఒక లిఫ్ట్‌ అవసరం కానుంది. ఈ రెండు ప్రణాళికల సాధ్యాసాధ్యాలపై నివేదికలు సిద్ధం చేయడానికి కరీంనగర్, మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఎస్టిమేషన్ల తయారీ జరుగుతున్నది. తుమ్మిడిహెట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించడం వల్ల మరో లిఫ్ట్ అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల అదనపు ఖర్చు భారం తప్పదు. దీంతో సుందిళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. దీని వల్ల సుమారు రూ.7వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు మిగులుతాయనే అభిప్రాయంతో ఉన్నది. మరోవైపు.. అధికారులు సిద్ధం చేస్తున్న ఎస్టిమేషన్లు ఈ నెల 22 నాటికి పూర్తికానున్నాయి. అనంతరం మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుందని తెలిసింది.

మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం

గతంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తు 152 మీటర్లుగా ప్రతిపాదించారు. దీనివల్ల తమ భూభాగంలో ముంపు ఏర్పడుతుందని మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 150 మీటర్ల మధ్యకు తగ్గించి, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిన నేపథ్యంలో ఇప్పుడు 149 మీటర్ల వరకైనా పర్మిషన్ సాధించాలని ప్రయత్నిస్తున్నది. ఈ నెల 22 తర్వాత రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. ఈ చర్చలు విజయవంతమై ఆ ప్రభుత్వం అంగీకరిస్తే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీ ప్రారంభం అవుతుందని తెలిసింది.

ప్రాణహితతో ఎంతో ప్రయోజనం

కాళేశ్వరం వల్ల అదనపు ఖర్చు ఉంటుందని.. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే అనేక సానుకూల అంశాలున్నాయని ఇరిగేషన్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పు ప్రకారం.. ఇక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని వెల్లడించింది. ఈ నీటిని గ్రావిటీ ద్వారా సుదూర ప్రాంతాలకు తరలించడం చాలా సులభమని సూచించింది. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు, కాళేశ్వరంతో పోలిస్తే నామమాత్రమే అనే నిపుణులు చెబుతున్నారు. అంచనాల ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీకి అయ్యే వార్షిక కరెంటు ఖర్చు సుమారు రూ.150 కోట్లు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి దాదాపు రూ.12 వేల కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తున్నది. గ్రావిటీ కెనాల్ వినియోగం వల్ల ఈ భారీ వ్యయం ఆదా అవుతుంది. కాగా.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా దాదాపు 72 కిలోమీటర్ల పొడవైన ప్రధాన గ్రావిటీ కెనాల్‌ను ఇప్పటికే నిర్మించి సిద్ధంగా చేసింది. ఇప్పుడు ఆ కాలువను వినియోగించుకుంటే నిర్మాణ వ్యయం, సమయం రెండూ ఆదా అవుతాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే తక్షణమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే.. ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యిత ఇచ్చి తొరగా పూర్తిచేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Next Story