మరింత ఊపందుకోనున్న ‘రియల్’ రంగం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

రవాణా ఆధారిత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రాష్ట్ర రాజధానితో వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేలా నిర్ణయాలను తీసుకుంటున్నది.

మరింత ఊపందుకోనున్న ‘రియల్’ రంగం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రవాణా ఆధారిత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రాష్ట్ర రాజధానితో వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. ఇందులో భాగంగా తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండేలా ఎక్స్ ప్రెస్ హైవే.. రైల్వే లైన్‌ వంటి సదుపాయాల కల్పనకు ఇరు రాష్ట్రాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృత అంశాలలో ఒకటైన అమరావతి- హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్​ హైవేకి కేంద్ర హోంశాఖ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్‌ ఫీల్డ్ ఎక్స్ ‍ప్రెస్ హైవేను 12 వరుసలతో చేపట్టాలని ఇరు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఎక్స్ ప్రెస్ హైవే హైదరాబాద్‌ నుంచి కాకుండా ఫోర్త్ సిటీ నుంచి చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇదే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఏపీ స్పందనను బట్టి ఎక్స్ ప్రెస్ హైవే అలైన్‌మెంట్‌పై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.

హైవేకు సమాంతరంగా రైల్వేలైన్‌

రాష్ట్రంలో తీరప్రాంతం లేకపోవడం.. సిమెంటు, బియ్యం, ఎరువులు, చమురు తదితర ఎగుమతులు, దిగుమతులకు కలుగుతున్న అవరోధాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్‌ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్‌ శివారులో ఏర్పాటు చేసే డ్రైపోర్టుకు మచిలీపట్నం నౌకాశ్రయానికి కనెక్టివిటీ ఉండేలా రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఫోర్త్ సిటీ మీదుగా వెళ్లేలా ఎక్స్ ప్రెస్ హైవేకు సమాంతరంగా ఈ రైల్వే లైన్‌ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం కేంద్రం వద్ద ఉంచింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో రైల్వే ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం నిర్వహించిన సమీక్షలోనూ ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎక్స్​​ ప్రెస్ హైవే, రైలు మార్గంతో రవాణా ఆధారిత అభివృద్ది జోరందుకుంటుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ రంగం, పారిశ్రామిక ప్రగతికి ఈ కొత్త ప్రాజెక్టు మరింత తోడ్పడుతుందని వారు పేర్కొంటున్నారు.

రూ.10 వేల కోట్ల అంచనా

ప్రస్తుతానికి హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి 65 కు సమాంతరంగా గ్రీన్‌ ఫీల్డ్​ ఎక్స్​​ ప్రెస్ హైవే ఏర్పాటు చేసే యోచన ఉంది. అయితే గ్రీన్‌ ఫీల్డ్ ​‍ ఎక్స్ ​ప్రెస్ హైవేను విజయవాడ రహదారి నుంచి కాకుండా ఫోర్త్ సిటీ నుంచి చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఫోర్త్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి నుంచి రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఎక్స్​ప్రెస్ హైవే కొనసాగి ఏపీలోని సత్తెనపల్లి మీదుగా అమరావతి క్యాపిటల్‌ సిటీ వరకు అనుసంధానం అయ్యేలా ప్రతిపాదించినట్టు తెలిసింది. చివరకు ఈ హైవే లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఉండేలా సూచనలు చేసినట్టు సమాచారం. 12 వరుసల ఎక్స్​ ప్రెస్ హైవేకు రూ.10 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి 211కి.మీ.లు కాగా బందర్‌ పోర్టుకు దాదాపు 297కి.మీ.లు ఉంటుంది. హైదరాబాద్‌- విజయవాడ మధ్య దూరంతో పోలిస్తే కొత్త ప్రతిపాదించిన రోడ్డు 57 కిలోమీటర్లు తక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ హైవేపై రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కూడా రెండున్నర గంటలే. అలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చిన వెంటనే ఎక్స్ ప్రెస్ హైవే కోసం డీపీఆర్‌కు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖలు సన్నద్ధమవుతున్నాయి.

ఫ్యూచర్‌ సిటీ నుంచి నలు దిశలా..

సీఎం రేవంత్‌ రెడ్డి కలల స్వప్నం ఫోర్త్‌ సిటీకి నలువైపుల నుంచి చేరుకునేలా రవాణా సదుపాయాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా 300 అడుగుల గ్రీన్‌ ఫీల్డ్ రోడ్డును ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు భూసేకరణ జరుగుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని రావిర్యాల నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగంలోని ఆమన్‌ గల్‌ వరకు మొత్తం 41.5 కి.మీ.ల మేర చేపడుతున్నారు. తొలి దశలో రావిర్యాల (టాటా ఇంటర్‌ చేంజ్‌)నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు చేపట్టే 19.20 కి.మీ.ల రోడ్డు నిర్మాణానికి రూ.1,665 కోట్లు, రెండో దశలో మీర్‌ఖాన్‌పేట నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పరిధిలోని అమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2,365కోట్లను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. టెండర్లు కూడా ఖరారైన ఈ రోడ్డుకు రతన్‌ టాటా రోడ్డుగా ప్రభుత్వం నామకరణం చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వద్ద నిర్మాణంలో ఉన్న స్కిల్‌ యూనివర్శిటీ వరకు మెట్రో కారిడార్‌ డీపీఆర్‌ తయారీ కోసం సర్వే పనులు చకచకా సాగుతున్నాయి. శంషాబాద్‌ నుంచి చెన్నై వరకు బులెట్‌ ట్రైన్‌ కోసం సీఎం ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుండడంతో ఫ్యూచర్‌ సిటీకి ఇది మరింత ప్రయోజనం చేకూర్చనున్నది.

Next Story