విద్యారంగంపై దృష్టి సారించిన ప్రజా ప్రభుత్వం

by Malleboina Mahesh |

తరగతి గదిలో దేశ భవిష్యత్ రూపుదిద్దుకుంటుందని విద్యావేత్త కొఠారి వ్యాఖ్యానించారు. అటువంటి తరగతి గదిని సజీవంగా ఉంచేది, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే.

విద్యారంగంపై దృష్టి సారించిన ప్రజా ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తరగతి గదిలో దేశ భవిష్యత్ రూపుదిద్దుకుంటుందని విద్యావేత్త కొఠారి వ్యాఖ్యానించారు. అటువంటి తరగతి గదిని సజీవంగా ఉంచేది, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఈ పవిత్రమైన వృత్తికి గౌరవాన్ని పెంచుతూ తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యారంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతలపై ప్రత్యేక కథనం..

ఉపాధ్యాయులకు సముచిత గౌరవం

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 10,006 మంది ఉపాధ్యాయులను, 1,265 మంది జూనియర్ లెక్చరర్లను, 64 మంది జూనియర్ అసిస్టెంట్లను, 30 మంది లైబ్రేరియన్లను నియమించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను కూడా వేగవంతం చేసింది. ఇటీవల, 4,454 మందికి స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్2 హెడ్‌మాస్టర్‌లుగా పదోన్నతులు కల్పించారు. అలాగే, 55 మంది జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపాళ్లుగా, 22 మందిని డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోట్ చేశారు. ఈ నియామకాలు, పదోన్నతులు, బదిలీల కారణంగా ఉపాధ్యాయులు రెట్టింపు ఉత్సాహంతో బోధన చేస్తున్నారు.

పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు..

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా టెట్ పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగిందని గుర్తించిన ముఖ్యమంత్రి, బాధ్యతలు స్వీకరించిన వెంటనే టెట్ పరీక్ష నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. 2024 మే, జూన్ నెలల్లో టెట్ నిర్వహించగా, రెండు పేపర్లకు కలిపి 2,36,487 మంది పరీక్ష రాశారు. 2024 డిసెంబర్, 2025 జూన్ నెలల్లో కూడా టెట్‌ను నిర్వహించి, ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తి చేసిన వారికి ఊరట కల్పించింది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరచడానికి ప్రభుత్వం నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. 2023-24లో రూ. 19,093 కోట్లుగా ఉన్న విద్యా బడ్జెట్‌ను, 2024-25లో రూ. 21,292 కోట్లకు, 2025-26లో రూ. 23,108 కోట్లకు పెంచింది. రూ. 676 కోట్లతో పాఠశాల్లో మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, రంగులు వేయడం తదితర పనులను వేసవి సెలవుల్లోనే పూర్తి చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో నెల రోజుల్లోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీని పూర్తి చేశారు.

వసతి గృహాల్లో సౌకర్యాల పెంపు..

3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గల విద్యార్థులకు రూ. 950 గా ఉన్న డైట్ ఛార్జీలను రూ. 1,330కి, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ. 1,100 నుంచి రూ. 1,540కి, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ. 1,500 నుంచి రూ. 2,100కి పెంచారు. కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం వల్ల హాస్టళ్లలో ఉంటున్న 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఉన్నత విద్యకు కొత్త రూపు..

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విశ్వవిద్యాలయాలు నిధులు, బోధనా సిబ్బంది లేక దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం, అన్ని యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించింది. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

నైపుణ్యాల కొరత తీర్చేలా

ఇంజినీరింగ్ విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సంకల్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ఈ యూనివర్సిటీకి పాలకమండలిని నియమించారు.

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్..

కుల‌మ‌త‌బేధాలకు అతీతంగా విద్యార్థుల‌కు నాణ్యమైన విద్య అందించాల‌నే ఉద్దేశ్యంతో యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ స్కూల్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ‌కారం చుట్టారు. ప్రతీ నియోజ‌క‌వ‌ర్గంలో బాలుర, బాలికల యంగ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్స్ నిర్మించ‌నున్నారు. ఒక్కో పాఠ‌శాల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించ‌నుంది.

Next Story