వైద్యుల బదిలీల్లో పారదర్శకత పాటించాలి : తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ వైద్యుల ఆన్‌లైన్ బదిలీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.

వైద్యుల బదిలీల్లో పారదర్శకత పాటించాలి : తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ వైద్యుల ఆన్‌లైన్ బదిలీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు బుధవారం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. రవీందర్ నాయక్, డీఎంఈ డా. నరేందర్ కుమార్, టీవీవీపీ కమిషనర్ డా. అజయ్ కుమార్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ప్రస్తుత ఆన్‌లైన్ విధానంలో సీనియారిటీ, వెయిటేజీ కేటాయింపుల్లో స్పష్టత లేదని, దీనివల్ల గ్రామీణ, క్లిష్ట ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు అన్యాయం జరుగుతోందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా అన్ని ఖాళీలను పోర్టల్‌లో ప్రదర్శించకపోవడం, సాంకేతిక లోపాలు, లాగిన్ సమస్యల వల్ల అర్హులైన వారికి ఇష్టమైన చోట పోస్టింగ్ పొందే అవకాశం దక్కడం లేదని పేర్కొంది. ఆన్‌లైన్ బదిలీ విధానంపై తక్షణమే సమీక్ష నిర్వహించాలని, అన్నిరకాల ఖాళీలను పారదర్శకంగా బయటపెట్టాలని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. నరహరి, సెక్రటరీ జనరల్ డా. లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డా. ఖాజా మొహమ్మద్ రౌఫుద్దీన్ డిమాండ్ చేశారు. సంఘం పదాధికారులకు ప్రభుత్వం కల్పించిన రక్షణ జీవోలను అమలు చేయాలని, గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. డిజిటల్ పరిపాలనను స్వాగతిస్తున్నామని, అయితే వైద్యుల్లో నమ్మకం కలిగించేలా కౌన్సెలింగ్ ప్రక్రియను న్యాయబద్ధంగా నిర్వహించాలని వారు కోరారు.

Next Story