Charminar: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్

by Gantepaka Srikanth |

చార్మినార్‌(Charminar) సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించి 17 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

Charminar: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మినార్‌(Charminar) సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించి 17 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.

కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story