- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య విద్యార్థులకు ఎన్ఎంసీ తీపి కబురు.. 810 మెడికల్ సీట్లు మంజూరు
ఎంబీబీఎస్ చదివి సమాజానికి సేవ చేయాలని భావించే వైద్య అభ్యర్థులకు జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తీపికబురు అందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీబీఎస్ చదివి సమాజానికి సేవ చేయాలని భావించే వైద్య అభ్యర్థులకు జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తీపికబురు అందించింది. రాష్ట్రానికి భారీగా మెడికల్ సీట్లు కేటాయించింది. 2026-27 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పూర్తిస్థాయి అధికారిక సీట్ మాట్రిక్స్‌ను మెడికల్ అసెస్ మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్(మార్బ్) విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏకంగా 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఈ పెంపుతో తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10,250కు చేరింది. గతంలో 9,440 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 110 సీట్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ రంగంలో మొత్తం సీట్ల సంఖ్య 4,410కు చేరాయి. 30 ప్రైవేటు వైద్య కళాశాలలకు 700 కొత్త సీట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రైవేట్ కోటాలో మొత్తం సీట్ల సంఖ్య 5,850కు పెరిగినట్టయింది. ఇందులో మల్లారెడ్డి గ్రూప్ పరిధిలోని రెండు కాలేజీల్లో 500 సీట్లు, నీలిమా మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉన్నాయి.
పెరిగిన సీట్లు ఇవే
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 30, ఆదిలాబాద్ రిమ్స్ కు 30, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 25, సిద్దిపేట మెడికల్ కాలేజీ 25 సీట్లతో కొత్తగా 110 సీట్లు మంజూరయ్యాయి. ప్రైవేట్ రంగంలో మహేశ్వర మెడికల్ కాలేజీకి 100, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 100, షాదన్ ఇన్ స్టిట్యూట్ 100, భాస్కర్ మెడికల్ కాలేజీలో 50, మమత మెడికల్ కాలేజ్-హైదరాబాద్ లో 50, మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ లో 50, మల్లారెడ్డి విమెన్స్ కాలేజీలో 50, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు పెరిగాయి. కొత్తగా ఏర్పాటైన రాజా రాజేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(గర్ల్స్) కళాశాలకు ఏకంగా 150 సీట్లు లభించాయి. దీంతో ప్రైవేట్ రంగంలో ఏకంగా 700 కొత్త సీట్లు దక్కాయి.
దేశవ్యాప్తంగా 1.36 లక్షల సీట్లు
దేశవ్యాప్తంగా ఎన్ఎంసీ జాతీయ ప్రాధాన్యం కలిగిన ఎయిమ్స్, జిప్‌మర్ వంటి సంస్థలను మినహాయించి మిగిలిన కాలేజీల సీట్లను భారీగా పెంచింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,911 ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 1,36,939కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలోని 441 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,111 సీట్ల పెంపుతో మొత్తం సీట్లు 63,296కు చేరాయి. దేశవ్యాప్తంగా 382 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 7,800 సీట్లు పెరగడంతో మొత్తం సీట్లసంఖ్య 73,643కు చేరింది. ఈ సీట్ల కేటాయింపు ప్రక్రియ కోర్టు తుది ఆదేశాలు లేదా అప్పీల్ కమిటీ నిర్ణయాలకు లోబడి ఉంటుందని, అనుమతించిన సీట్ల కంటే ఒక్క అడ్మిషన్ కూడా అదనంగా చేయకూడదని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీలు, కాలేజీ యాజమాన్యాలను ఎన్ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లాంగర్ ఆదేశించారు.






