- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్ల మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
జడ్చర్ల మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. సర్కారు నిబంధనలు తుంగలో తొక్కి, అధికారులను మామూళ్ల మత్తులో ముంచేసి పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుకను తోడేస్తూ ఏటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

దిశ,జడ్చర్ల: జడ్చర్ల మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. సర్కారు నిబంధనలు తుంగలో తొక్కి, అధికారులను మామూళ్ల మత్తులో ముంచేసి పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుకను తోడేస్తూ ఏటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఈ విచ్చలవిడి తవ్వకాల వల్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతుండటంతో, సమీప గ్రామాల వ్యవసాయ బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డంపింగ్ జోన్లు రెడీ!
గత వర్షాకాలంలో దుందుభి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది. దీనిపై కన్నేసిన ఇసుక మాఫియా ముఠాలుగా ఏర్పడి దోపిడీకి తెరలేపాయి. ముఖ్యంగా గంగాపురం, అమ్మపల్లి, అల్వన్ పల్లి, కుర్వగడ్డ పల్లి గ్రామ శివారుల్లోని వాగుల నుంచి జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలోకి ఎత్తిపోస్తున్నారు. ఈ ఇసుకను నేరుగా తరలిస్తే దొరికిపోతామనే భయంతో వాగుల పరిసర ప్రాంతాల్లోనే వందల సంఖ్యలో రహస్య డంపులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అర్ధరాత్రి వేళల్లో జేసీబీల సాయంతో పదుల సంఖ్యలో టిప్పర్లలో నింపి హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు వాగు పక్కనే నిల్వ ఉంచి స్థానికులకు ట్రిప్పునకు రూ.1,200 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రూ.5 వేల పలుకుతున్న ట్రిప్పు..
సాధారణ ఇళ్ల నిర్మాణదారులకు ఇసుక దొరకడమే గగనమైపోతుంటే అక్రమార్కులకు మాత్రం ఇసుక బంగారమై కురుస్తోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ దందాతో ఏటా రూ.కోట్లు ప్రైవేటు వ్యక్తుల చేతులు మారుతున్నాయి. ఈ అక్రమ సంపాదనలో సింహభాగం స్థానిక అధికారుల మామూళ్లకే సరిపోతోందని ఆరోపణలు వినిపిస్తుంది. అయితే, వాగుల్లోంచి ఇసుకను విచ్చలవిడిగా తోడేస్తుండటంతో దుందుభి వాగులో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వాగు పక్కనే ఉన్న వ్యవసాయ బోర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి టాస్క్‌ఫోర్స్ బృందాలతో దాడులు నిర్వహించి దుందుభి వాగును, స్థానిక రైతాంగాన్ని కాపాడాలని జడ్చర్ల మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






