ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఎల్ నినో (El Nino) ప్రభావం, దానివల్ల తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎల్ నినో (El Nino) ప్రభావం, దానివల్ల తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో తీవ్రతను అంచనా వేయడంతో పాటు ముందస్తు నివారణ చర్యలను సూచించేందుకు గాను ఒక ఉన్నత స్థాయి 'రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ'ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీకి చైర్మన్‌గా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత అవగాహన ఉన్న ఆయన నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. అలాగే.. ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిపుణుల కమిటీ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై అంచనా, రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత లోటు, భూగర్భ జలాల క్షీణత, వ్యవసాయ రంగానికి ఎల్ నినో వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి నివేదిక సిద్ధం చేస్తుంది.

భవిష్యత్తులో కరవు పరిస్థితులు తలెత్తితే వాటిని అధిగమించడానికి, తాగునీరు, సాగునీటి ఎద్దడి రాకుండా చూసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించడం, పంట నష్టాన్ని తగ్గించేలా విపత్తు నిర్వహణ ప్రణాళికలను ఈ కమిటీ రూపొందించనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణను, రైతులకు అవసరమైన సహాయక చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయనుంది.

Next Story