- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవి వేళ రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, నీటి పారుదల, ఇతర కీలక రంగాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ను ఏర్పాటు చేసిందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, నీటి పారుదల, ఇతర కీలక రంగాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ను ఏర్పాటు చేసిందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. ఈ సంస్థకు అవసరమైన అన్ని అనుమతులు దశలవారీగా పొందుతూ, ఈ ఏడాది జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. రైతు డిస్కం నిర్మాణం సమగ్రంగా, సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని.. ఇందులో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి సమస్యలూ ఉండబోవని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంస్థ రూపకల్పన జరుగుతున్నదని.. మానవ వనరుల సమీకరణలో భాగంగా శుక్రవారం ఆయన విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు రైతు డిస్కం కూడా తెలంగాణ విద్యుత్ వ్యవస్థలో కీలక భాగంగా పనిచేస్తుందని తెలిపారు.
వ్యాపార విభజనలో రైతు డిస్కం కీలక పాత్ర..
వ్యాపార విభజనలో భాగంగా దక్షిణ డిస్కం 44శాతం, రైతు డిస్కం 42శాతం, ఉత్తర డిస్కం 14శాతం బాధ్యతలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా సుమారు 2 వేల మంది ఉద్యోగులతో రైతు డిస్కం కార్యకలాపాలు ప్రారంభించనున్నామని, అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశముందని తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, నియమ, నిబంధనలు ఇతర విద్యుత్ సంస్థల మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగుల నియామకాలు, విధుల కేటాయింపులపై యూనియన్లు, అసోసియేషన్ నాయకులతో సవివరంగా చర్చించారు. రైతు డిస్కం ఏర్పాటు ద్వారా విద్యుత్ సంస్థల ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగుల కేటాయింపులపై ఎలాంటి అపోహలు లేకుండా, గందరగోళం తలెత్తకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ, ఉత్తర డిస్కంల నుండి ఉద్యోగులను డిప్యూటేషన్‌పై సమకూర్చుకున్నామని, భవిష్యత్తులో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల కూడా మానవ వనరుల సమీకరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతాంగం, ఇతర వినియోగదారుల హక్కుల పరిరక్షణతో పాటు విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎండీ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 65 మంది నాయకులు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






