హర్యానాలో పర్యటిస్తున్న తెలంగాణ రైతు కమిషన్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం రూపొందించడానికి ప్రభుత్వం వేసిన విత్తన చట్టం ముసాయిదా కమిటీ సభ్యులు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

హర్యానాలో పర్యటిస్తున్న తెలంగాణ రైతు కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం రూపొందించడానికి ప్రభుత్వం వేసిన విత్తన చట్టం ముసాయిదా కమిటీ సభ్యులు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి చండీఘడ్‌కు బృందం చేరుకున్నది. హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో పంచకుల నగరంలోని ప్రభుత్వ కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కమిటీ సభ్యులు దొంతి నర్సింహా రెడ్డి, రామనుజేయులు, శివప్రసాద్, వ్యవసాయ అధికారి హరి వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఇక హర్యానా రాష్ట్రం నుండి అక్కడి వ్యవసాయ అధికారులు ప్రదీప్ మీల్, అమిత్ కుమార్‌తోపాటు హర్యానా సీడ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

హర్యానాలో అమలవుతున్న విత్తన చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. హర్యానా రాష్ట్రం రూపొందించిన సీడ్ సవరణ బిల్లుకు సంబంధించి అమలు విధానాలు, నిబంధనలు అనుభవాలను ప్రత్యక్షంగా తెలంగాణ బృందం తెలుసుకుంది. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలపై తెలంగాణ ప్రతినిధుల బృందం వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం ఇప్పటి వరకు చేపట్టిన పథకాల గురించి వివరించారు. ప్రధానంగా ఏకకాలంలో 21 వేల కోట్ల రుణమాఫీ చేయడంతో లక్షలాది మంది రైతులు రుణ విముక్తులయ్యారని తెలిపారు.

అలాగే సీజన్‌కు ముందు రైతు భరోసా, సన్నాలకు 500 రూపాయల బోనస్ పథకాలతోపాటు సబ్సీడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, గిరిజన ప్రాంతంలో పోడు భూముల సాగు కోసం కొత్తగా తీసుకొచ్చిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాలు అమలవుతున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వివరించారు. నేడు బుధవారం ఉదయం హర్యానాలో పర్యటన కొనసాగనుంది. స్థానికంగా ఉన్న హరిపూర్ బ్లాక్ రాయ్‌పూర్ రాణి గ్రామంలో పర్యటించి అక్కడ అమలవుతున్న విత్తన చట్టంపై హర్యానా రాష్ట్ర రైతుల నుండి అభిప్రాయాలను సేకరించనున్నారు.ఆపై హై పవర్ కమిటీ తో తెలంగాణ ప్రతినిధుల బృందం సమావేశం కానుంది.

Next Story