- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కరువు పని’ కనుమరుగు.. ఇకపై ఆ ప్రాంతాల్లోనే అమలు!
‘కరువు పని’ కనుమరుగు.. ఇకపై ఆ ప్రాంతాల్లోనే అమలు!

దిశ, తెలంగాణ బ్యూరో: కరువు వచ్చినా.. వర్షాభావ పరిస్థితులున్నా.. వేసవిలో వ్యవసాయ పనులు లేకపోయినా ఊర్లో ‘ఉపాధి’ పని దొరుకుతుందని ఇప్పటి వరకూ అందరు ధీమాతో ఉన్నారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఇప్పుడు గ్రామాల్లో ఉపాధి పనులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం కేటాయించిన నిధులకనుగుణంగానే పని లభించనుంది. ఫండ్స్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర సర్కారు నిధులు కేటాయించక పోతే పని దొరికే అవకాశం ఉండదు.
ఆకలి చావులు, వలసలు ఉండొద్దని..
గతంలో కూలీలు వలసలు పోకుండా, ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ‘ఉపాధిహామీ’ని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఉపాధి పనులకు వెళ్లే వారిలో ఇప్పటికీ 98 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 60 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. ఐదు సంవత్సరాల లెక్కలను పరిశీలిస్తే.. ఉపాధి పనులను ఎస్సీలు 21 నుంచి 22 శాతం, ఎస్టీలు 20 నుంచి 21 శాతం ఉపయోగించుకుంటున్నారు. వీరిలో 58 నుంచి 63 శాతం మంది మహిళలు ఉపాధి పనులకు వెళ్తున్నారు.
కేంద్రం నుంచి 60% నిధులే
2005లో కాంగ్రెస్ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ స్కీమ్‌ను.. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రద్దు చేసి.. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (వీబీజీ రామ్‌జీ) పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద పని చేసిన కూలీలకు ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించేది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం 60% నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంటుంది. ఇందులో మరో కీలకమైన మార్పు చేశారు. ఉపాధి ఇప్పటి వరకు హక్కుగా ఉండగా ఆ హక్కును తొలగించారు. అంతే కాకుండా రాష్ట్రం మొత్తం అమలు కాకుండా కొన్ని ఎంపిక చేసిన, అవసరమైన ప్రాంతాల్లోనే అమలు చేస్తారు. కూలీలు పని కావాలని డిమాండ్‌చేసిన వెంటనే పని కల్పించే హక్కు పోతుంది. కేంద్రం కేటాయించిన నిధులు ఖర్చు అయితే ఇక అంతే సంగతులు.
రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం
తెలంగాణలో ఉపాధి పథకం కింద పని చేస్తున్న కూలీలకు ప్రతి సంవత్సరం నేరుగా వారి అకౌంట్లలో రూ.2,600 కోట్లు జమ అవుతున్నాయని అంచనా ఉంది. ఉపాధిహామీ పథకాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ముందున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధన ఆయా ప్రభుత్వాలపై అదనపు భారాన్ని మోపనుంది. తెలంగాణపై సుమారు రూ.1,500 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.






