విద్యుత్ సవరణ బిల్లును ఆమోదిస్తే సమ్మె తప్పదు.. తెలంగాణ విద్యుత్ జేఏసీ హెచ్చరిక

by Ramesh Naini |

ఉత్తర ప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు ఆ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలకు తాము సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా పేర్కొన్నారు.

విద్యుత్ సవరణ బిల్లును ఆమోదిస్తే సమ్మె తప్పదు.. తెలంగాణ విద్యుత్ జేఏసీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర ప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు ఆ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలకు తాము సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా పేర్కొన్నారు. విద్యుత్ సవరణ-2025 బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తే దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడమని ఆయన హెచ్చరించారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్.సీ.సీ.ఓ.ఇ.ఇ.ఇ) పిలుపు మేరకు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2025 ను వ్యతిరేకిస్తూ గురువారం టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారని, ప్రైవేటీకరణ ద్వారా రైతులు, సాధారణ విద్యుత్ వినియోగదారులు, ఉద్యోగులు ఇబ్బంది పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ రంగం ఉంటే వినియోగదారులకు, రైతులకు తక్కువ రేటుకు విద్యుత్ దొరుకుతుందని జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు తెలిపారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే ఉద్యోగులు ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. జనవరి 30న జరిగే ఛలో ఢిల్లీలో పాల్గొనాలని ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును తాము అడ్డుకుని తీరుతామని కో కన్వీనర్ బీసీ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కరుణాకర్ రెడ్డి, గోవర్ధన్, నెహ్రూ, సదానందం సహా పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story