స్థానిక ఎన్నికలపై అయోమయం.. ఇరకాటంలో ఎన్నికల కమిషన్

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరకాటంలో పడింది.

స్థానిక ఎన్నికలపై అయోమయం.. ఇరకాటంలో ఎన్నికల కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరకాటంలో పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దానిని ఆపాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చని సూచించింది. బీసీలకు అదనంగా ఇచ్చిన 17 శాతాన్ని తగ్గించి దానిని జనరల్​కేటగిరిలోకి మార్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఎన్నికల సంఘం తర్జనభర్జన పడుతున్నది. ఒక వైపు ప్రభుత్వం మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. హైకోర్టు మాత్రం బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఎస్ఈసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ రాణికుముదిని న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. రేపు మరికొందరితో సంప్రదింపులు చేసిన తర్వాత ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయానికి తీసుకోనున్నట్టు సమాచారం.

ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా?

ప్రభుత్వ సమ్మతితోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్​చట్టంలో స్పష్టంగా పొందుపర్చారు. దీంతో ప్రభుత్వాన్ని కాదని ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్తన్నమవుతున్నది. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర తీర్పులో బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు తగ్గించి 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇందులో ఏ నిర్ణయానికి కట్టుబడితే ఏ సమస్యలు వస్తాయోనని ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు.

ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు

బీసీలకు ఎలాగైనా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటున్నది. ఈ సమయంలో రిజర్వేషన్లను ఎన్నికల సంఘమే తగ్గించి ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యమేనా?.. ఒక వేళ్ల తగ్గిస్తే బీసీ సంఘాలు, బీసీ వర్గాల ప్రజలు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుందనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల సంఘమే రిజర్వేషన్లు తగ్గించి ఎలక్షన్స్ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా? అనే అంశంపైనా వివరాలు సేకరిస్తున్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్​లీవ్​పిటిషన్​వేయనుంది. దానిపై వచ్చే స్పందన ఆధారంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ముందే షెడ్యూల్ ఇవ్వడంతో సమస్య

బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగానే ఎస్ఈసీ స్థానిక ఎన్నికల నోటిషికేషన్ విడుదల చేయడంతో సమస్య తలెత్తిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పు వచ్చాక షెడ్యూల్​విడుదల చేస్తే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని చెబుతున్నారు. అదే సమయంలో ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఆశావహులు, అధికారులకు ఇబ్బందులు తప్పేవని చెబుతున్నారు.

Next Story