- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash: అది దగ్గుమందు కాదు విషం.. తెలంగాణ డీసీఏ ఎమర్జెన్సీ అలర్ట్ జారీ
దగ్గుమందులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్ లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు తాగి 20కి పైగా పిల్లలు చనిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుమందులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్ లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు తాగి 20కి పైగా పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత ఆ దగ్గుమందు తయారీ కంపెనీపై కేంద్రం చర్యలు తీసుకుంది. వాటి ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తెలంగాణలోనూ పిల్లల దగ్గుమందుపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అల్మాంట్–కిడ్ సిరప్ (Almont-Kid Syrup)ను వాడవద్దని హెచ్చరించింది. అది దగ్గు మందు కాదని, దగ్గుమందు రూపంలో ఉన్న స్లో పాయిజన్ అని తెలిపింది.
అత్యవసర హెచ్చరిక
ఈ దగ్గుమందులో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాల్సిందిగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఔషధ ప్రమాద నియంత్రణ సంస్థ (CDSCO) ఈస్ట్ జోన్, కోల్ కతా నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. బిహార్ కు చెందిన ట్రిడస్ రెమిడీస్ అనే ఫార్మా సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్ సిరప్ శాంపిల్స్ ను పరిశీలించగా.. అత్యంత విషపూరితమైన ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలిందని అధికారులు వివరించారు. ఇది శరీరంలోని కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన కెమికల్ అని, పిల్లలకు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అల్మాంట్ - కిడ్ సిరప్ ను ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే దానిని వెంటనే వాడటం ఆపాలని సూచించారు. దీనిపై ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే నేరుగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖకు తెలియజేయవచ్చని, టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 నంబరును అందుబాటులో ఉంచుతున్నామని తెలిపింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సిరప్ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






