- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం CPRO మధు కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్వో (CPRO) మారబోయిన మధుసూదన్ కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ జర్నలిస్ట్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్వో (CPRO) మారబోయిన మధుసూదన్ కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో స్పెక్ట్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మధుసూదన్‌కి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మధుసూదన్ మరణవార్త విన్న వెంటనే రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకున్నారు. మధుసూదన్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి..
తన సీపీఆర్వో మరణం పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అత్యంత నిజాయితీ గల, నిబద్ధత కలిగిన పాత్రికేయుడిని కోల్పోవడం బాధాకరం. వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అదర్శనీయం. ఈ కష్ట సమయంలో మధుసూదన్ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మారబోయిన మధుసూదన్ పలు మీడియా సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలు నిర్వహించారు. విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలోనూ ముందుండేవారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






