బరువు తగ్గించే మందుల విక్రయాలపై డీసీఏ ఉక్కుపాదం

by Naga Rani Yarlagadda |

అందంగా, స్లిమ్‌గా కనిపించాలనే ఆశను ఆసరాగా చేసుకుని బరువు తగ్గించే మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డీసీఏ దాడులు చేసింది.

బరువు తగ్గించే మందుల విక్రయాలపై డీసీఏ ఉక్కుపాదం
X
  • రాష్ట్రవ్యాప్త దాడుల్లో 75 మెడికల్ షాపుల గుట్టురట్టు.. షోకాజ్ నోటీసులు జారీ

దిశ, తెలంగాణ బ్యూరో : అందంగా, స్లిమ్‌గా కనిపించాలనే ఆశను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా బరువు తగ్గించే మందులను (వెయిట్ లాస్ డ్రగ్స్) విక్రయిస్తున్న మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) దాడులు జరిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. అత్యంత డిమాండ్ ఉన్న ఈ మందులను ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... రాష్ట్రవ్యాప్తంగా ఇల్లీగల్ గా బరువు తగ్గించే మందుల విక్రయాలపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కొరడా ఝులిపించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో నిబంధనలు ఉల్లంఘించిన 75 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న మౌంజారో (టిర్జెపటైడ్), ఓజెంపిక్, వెగోవి, రిబెల్సస్ (సెమాగ్లుటైడ్) వంటి బరువు తగ్గించే మందులు, వాటి జెనరిక్ వెర్షన్లపై డీసీఏ ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ మందుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్త తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో అధికారులు పలు విస్తుపోయే నిజాలను గుర్తించారు. స్పెషలిస్ట్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, నకిలీ మందుల చలామణి, కస్టమర్లకు బిల్లులు ఇవ్వకపోవడం, కొనుగోలు-విక్రయ రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేకుండానే మందులు పంపిణీ చేయడం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం నిబంధనలను బేఖాతరు చేయడం వంటి ఉల్లఘనలు గుర్తించినట్లు డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 75 షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బరువు తగ్గడం కోసం సొంతంగా ఈ మందులు వాడటం ప్రాణాపాయానికి దారితీయవచ్చునని డీసీఏ ప్రజలకు సూచించింది. కేవలం ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టుల సూచన మేరకు మాత్రమే ఈ మందులు వాడాలని తెలిపింది. ఈ మందులను కేవలం గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే కొనాలని... ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా అనధికారిక వ్యక్తుల దగ్గర కొని మోసపోవద్దని కోరింది. నకిలీ మందుల విక్రయాల సమాచారం ఉంటే డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

Next Story