Coldriff Syrup: పిల్లల ప్రాణాలకు ముప్పు.. ‘కోల్డ్‌రిఫ్’ సిరప్‌పై తెలంగాణ డీసీఏ నిషేధం

by Ramesh Naini |

కోల్డ్‌రిఫ్ సిరప్‌ (Coldrif Syrup) వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

Coldriff Syrup: పిల్లల ప్రాణాలకు ముప్పు.. ‘కోల్డ్‌రిఫ్’ సిరప్‌పై తెలంగాణ డీసీఏ నిషేధం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పిల్లల మరణాలకు కారణమైందన్న అనుమానాల నేపథ్యంలో కోల్డ్‌రిఫ్ సిరప్‌ (Coldrif Syrup) వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ (Telangana State Drugs Control Administration) (డీసీఏ) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. సిరప్‌లో డైఇథిలీన్ గ్లైకాల్‌ (డీఈజీ) కల్తీ అయినట్లు ప్రాథమిక నివేదికలు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కొందరు పిల్లలు ఈ సిరప్‌ సేవించిన తర్వాత మరణించారని సమాచారం రావడంతో డీసీఏ అప్రమత్తమైంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువార్చత్రంలో ఉన్న శ్రీసన్‌ ఫార్మా ఈ సిరప్‌ను తయారు చేసినట్లు గుర్తించారు.

ప్రమాదకరమైన బ్యాచ్ వివరాలు..

మే2025న తయారీ అయిన కోల్డ్‌రిఫ్ సిరప్ (పారాసెటమాల్, ఫెనిలెఫ్రిన్ హెచ్‌సీఎల్, క్లోర్‌ఫెనిరమైన్ మలేట్) బ్యాచ్ నంబర్ ఎస్ఆర్-13 గడువు తేదీ ఏప్రిల్-2027 ఉన్న మొత్తం సిరప్ బాటిల్స్ వాడటం అత్యంత ప్రమాదకరమని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం తెలిపారు. ప్రజలు ఈ సిరప్‌ను వెంటనే వాడటం ఆపాలని సూచించారు. ఎవరి వద్ద ఈ బ్యాచ్ ఉన్నా వెంటనే సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు మెడికల్ షాపులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆస్పత్రుల వద్ద నిల్వ ఉన్న ఈ బ్యాచ్‌ను వెంటనే స్తంభింపజేయాలని తాజాగా డీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, సహకరించాలంటూ డీసీఏ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్: 1800-599-6969 ఫోన్ చేయాలని డీసీఏ సూచించింది.

Next Story