నెల రోజుల్లో విద్యార్థులందరికీ 2 జతల యూనిఫామ్‌లు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్‌లను నెల రోజుల్లోగా అందించాలని సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

నెల రోజుల్లో విద్యార్థులందరికీ 2 జతల యూనిఫామ్‌లు
X
  • జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ సంజయ్ జాజు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్‌లను నెల రోజుల్లోగా అందించాలని సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి స్కూల్ యూనిఫామ్‌ల తయారీ, పంపిణీ, ఎల్-నినో ప్రభావంపై చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళికలపై ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. యూనిఫామ్‌ల తయారీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను గుర్తించినట్లు తెలిపారు. యూనిఫామ్‌ల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందజేస్తున్న స్కూల్ డ్రెస్‌లు, షూస్ తదితర కిట్ల నాణ్యతపై నేరుగా విద్యార్థుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు గుర్తుచేశారు. సకాలంలో యూనిఫామ్‌ల కుట్టే ప్రక్రియ పూర్తి కావడానికి జిల్లా, మండల స్థాయిలలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి

ఐఎండీ నివేదికల ప్రకారం.. దేశంలో ఎల్-నినో ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 27 శాతం లోటు వర్షపాతం నమోదైందని, కేవలం 7 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా రైతులకు చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో, మేజర్ రిజర్వాయర్లలోని నీటిని తాగునీటి అవసరాల కోసం నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ మాసంలోనూ వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం చేసినందున, రైతులు వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సీఎస్ పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ పంటలకు కూడా కనీస మద్దతు ధర లభిస్తున్నందున ఆ దిశగా రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో ఫామ్‌ పాండ్స్‌ నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల సమావేశాలు జరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సవ్యసాచి ఘోష్, దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపీ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story