- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహుల ఎదురుచూపులు: ఈ నెలలోనే ప్రకటన?
కాంగ్రెస్పార్టీలో నామినేటెడ్ పోస్టుల జాబితా కొలిక్కి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య నాయకులు అందరి ఆమోదంతో లిస్టు ఢిల్లీకి చేరింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్పార్టీలో నామినేటెడ్ పోస్టుల జాబితా కొలిక్కి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య నాయకులు అందరి ఆమోదంతో లిస్టు ఢిల్లీకి చేరింది. తెలంగాణలో 35కు పైగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్‌లను ఇప్పటికే నామినేట్ చేశారు. కమిషన్‌లకు మినహా మిగిలిన వాటికి డైరెక్టర్‌లను నియమించలేదు. కొత్త చైర్మన్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించి ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. వాటిలో నామినేటెడ్ డైరెక్టర్లు లేకుండానే ఆ పాలకమండళ్లు కొనసాగుతున్నాయి. చైర్మన్పదవి అడిగితే కనీసం డైరెక్టర్ పోస్టుఅయిన రాకపోతదా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి మరొకొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో కష్టపడినందుకు ఏదో ఒకటి వస్తే గుర్తింపు వచ్చినట్లుగా భావించి సంతోషం, సంతృప్తి పడటానికి కొందరు సిద్ధమయ్యారు.
ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు..
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కొద్దిరోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే.. పదవులను వెంటనే భర్తీ చేయాలని పార్టీ పరిశీలకులను ఆదేశించారు. దీంతో శాసనసభ్యులు, పార్టీ ఇన్‌చార్జి, నాయకులతో సంప్రదించి నియోజకవర్గానికి ఇద్దరి పేర్ల చొప్పున ఎంపిక చేశారు. డైరెక్టర్‌లుగా నియమించడానికి ఉన్న అర్హతలను రాష్ట్ర నాయకత్వం పరిశీలించి పేర్లను ఖరారు చేసినట్టు తెలిసింది.
కేటగిరీల వారీగా పరిశీలన..
సామాజిక వర్గం, జిల్లాలు, మహిళలు, కొత్త, పాత ఇలా అన్నింటినీ పరిశీలించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా సమాచారం. ముందుగా డైరెక్టర్‌లపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలిసింది. చైర్మన్‌ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, కొందరి పేర్ల విషయంలో స్పష్టత రాగా.. వారి పేర్లను సైతం డైరెక్టర్‌ల జాబితాతో ఏఐసీసీకి పంపించినట్లుగా తెలుస్తోంది. ఏఐసీసీ ఆ జాబితాను ఆమోదించగానే అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ నాయకులు మాత్రం ఏఐసీసీ నేతలకు ఎవరైనా ఫిర్యాదు చేసినా, సామాజిక కోణం సెట్కాలేదనే పెద్దలు అభిప్రాయానికి వచ్చినా ఆ జాబితాను మరోసారి పరిశీలించి పంపించాలంటూ రిటర్న్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది. నాయకుల మధ్య ఏకాభిప్రాయం వచ్చినా.. ముఖ్య నాయకుల్లో ఎవరైనా అంతర్గతంగా అభ్యంతరం తెలిపితే జాబితా ఆగుతుందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు అధికారిక ప్రకటన వద్దని మరికొందరు సూచిస్తున్నట్టుగా సమాచారం. ఇలా ఏది జరిగినా జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అన్ని సాఫీగా జరిగితే ఈ నెలాఖరు కల్లా జాబితా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ జాబితాను ఎప్పుడు ప్రకటిస్తారని ఆశావహులు ఎదురుచూస్తున్నట్టు సమాచారం.






