TG: మహిళలకు కాంగ్రెస్ MP కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, చేస్తున్న దుష్ప్రచారాన్ని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

TG: మహిళలకు కాంగ్రెస్ MP కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, చేస్తున్న దుష్ప్రచారాన్ని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ గానీ, ఇండియా కూటమి గానీ మహిళా రిజర్వేషన్లకు ఎన్నడూ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిన్న మహిళల గురించి మాట్లాడిన మాటలపై స్పందిస్తూ చామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. "తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమే గతంలో 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందినా, 2024 ఎన్నికల తర్వాత కూడా వాటిని ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలి," అని ఆయన డిమాండ్ చేశారు.

రిజర్వేషన్లకు మద్దతు..

మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్రం పెట్టిన షరతులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2027 జనగణన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేస్తామని మోడీ, అమిత్ షా చెప్పారు. కానీ 33 శాతం రిజర్వేషన్లను ఇప్పుడే అమలు చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కేవలం అశాస్త్రీయమైన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) కు మాత్రమే వ్యతిరేకం. తమకు నచ్చినట్లు ఓట్లను తొలగించి, సీట్లను మార్చుకుని ఎప్పటికీ అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తోంది. డీలిమిటేషన్ విషయంలో గత ప్రభుత్వాల విధానాలను గుర్తు చేస్తూ చామల కీలక సూచనలు చేశారు. డీలిమిటేషన్ చేయాలంటే అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలి. గతంలో ఇందిరాగాంధీ, వాజ్ పాయ్ అనుసరించిన విధానాలనే అమలు చేయాలి. ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మధ్య సీట్ల విషయంలో అంతరం రాకుండా చూడాలని సూచించారు.

తెలంగాణ మహిళలకు విజ్ఞప్తి..

బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మహిళలు నమ్మవద్దు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళల పక్షమే ఉంటుంది. ఎస్.ఐ.ఆర్ పేరుతో ఓట్లు తొలగించినట్లుగానే, డీలిమిటేషన్ ద్వారా కూడా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. ఈ కుట్రలను మేము అడ్డుకుంటాం అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story