వరద ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల బృందం పర్యటన.. బాధితులకు విజయశాంతి హామీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-31 08:23:04  IST  )

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం పర్యటిస్తోంది. బాధితులకు కాంగ్రెస్ సహాయం చేస్తుందని ఎమ్మెల్సీ విజయశాంతి హామీ ఇచ్చారు.

వరద ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల బృందం పర్యటన.. బాధితులకు విజయశాంతి హామీ
X

దిశ, వెబ్ డెస్క్/ హైదరాబాద్‌: రాష్ట్రంలో కొనసాగుతున్న వరద ప్రభావిత పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు టీఎస్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల బృందం నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ ఆదేశాల మేరకు ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, విజయశాంతి, బల్మూరి వెంకట్‌, శంకర్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని జీఆర్ కాలనీలో ఈ ఎమ్మెల్సీల బృందం పర్యటించి.. బాధితులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయశాంతి.. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలిపారు. అక్కడి దృశ్యాలు చూస్తోంటే గుండె తరుక్కుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు సహాయం అందిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా నిలుస్తారని తెలిపారు.

ప్రభావిత గ్రామాల్లో వరద కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితుల సమస్యలను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు ఈ బృందాన్ని నియమించారు. స్థానిక నేతలతో కలిసి రైతులు, ప్రజల నుంచి ఈ బృందం వివరాలు, సమస్యలు తెలుసుకుని ఆ నివేదికను టీపీసీసీకి సమర్పించనుంది.

ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. టౌన్లో వరద తగ్గినా ఇళ్లల్లో బురద తగ్గలేదు. ఎటుచూసినా వరదకు కొట్టుకుపోయిన సామాన్లు, వాహనాలు దర్శనమిస్తున్నాయి. టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవ్వడంతో ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Next Story