మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆశావహుల్లో ఆ సామాజికవర్గ నేతలు ఉండటంపై హైకమాండ్ అసహనం

by Gantepaka Srikanth |

లోకల్ బాడీ ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం ఆదేశించినట్టు ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు.

మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆశావహుల్లో ఆ సామాజికవర్గ నేతలు ఉండటంపై హైకమాండ్ అసహనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోకల్ బాడీ ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం ఆదేశించినట్టు ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు. మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న నేతలతో లాబీయింగ్ చేసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సైతం సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ ముగించుకుని ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. మరుసటి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలతోపాటు రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతారని తెలిసింది.

ప్రస్తుతానికి పాక్షిక విస్తరణనే?

ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆరు సీట్లను భర్తీ చేయకుండా పాక్షిక విస్తరణకే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు టాక్. ఒకవేళ పూర్తిస్థాయి విస్తరణ చేపడితే పదవి దక్కని లీడర్లు అసంతృప్తికి గురవుతారని, ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే ప్రమాదం ఉన్నదని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇద్దరు లేదా ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకుని మిగతా ఖాళీలను పెండింగ్‌లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మంత్రి పదవులు దక్కని లీడర్లు ఖాళీగా ఉన్న స్థానాల్లో తర్వాతైనా తమకు చోటు దక్కుతుందనే ఆశతో ఉంటారని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

ఛాన్స్ ఎవరికి?

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో నిజామామాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి తప్పనిసరిగా ప్రయారిటీ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సామాజిక సమీకరణలు కుదిరితే ఆ జిల్లాల నుంచి సైతం నేతలకు అవకాశం దక్కనుంది. లేదంటే పెండింగ్‌లో పడే చాన్స్ ఉన్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒకరిని కేబినెట్‌లోకి తీసుకుంటామని శ్రీహరిని దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ ప్రకటించారని ఆ వర్గం లీడర్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మైనార్టీలు లేకపోవడంతో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్‌కు‌ అవకాశం దక్కుతుందని టాక్.

రెడ్డి ఎమ్మెల్యేలపై హైకమాండ్ అసహనం!

మంత్రి పదవి కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ కాకుండా, మరో ముగ్గురు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఆ వర్గానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు పదవులు కావాలని రెడ్డి వర్గం నేతలు అడగడంపై పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.

హామీ ఇచ్చారంటూ ఒత్తిడి?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్.. ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి మంత్రి పదవి ఇస్తామని రాష్ట్ర నేతలు హామీ ఇచ్చారని టాక్. సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆ ఇద్దరినీ కేబినెట్‌లోకి తీసుకోలేదు. కానీ విస్తరణ జరిగితే తమకు మంత్రి పదవులు తప్పకుండా ఇవ్వాలని ఆ ఇద్దరు ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పరిస్థితులు, సామాజిక కూర్పులను అర్థం చేసుకోకుండా హామీ ఏమైంది? అని వారిద్దరూ ఢిల్లీలో చక్కర్లు కొట్టడంపై కొందరు ఏఐసీసీ లీడర్లు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వివేక్‌తోపాటు ఆయన అన్న వినోద్‌ ఎమ్మెల్యేగా, కొడుకు వంశీ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆ ఫ్యామిలీకి ఇప్పటికే మూడు పదవులు దక్కాయి. మరోవైపు వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్నారు. మళ్లీ ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి పదవి అడగడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అన్న... మాకు మంత్రి పదవులు వస్తాయా?

మంత్రి పదవి కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న నేతలు రాజగోపాల్‌రెడ్డి, ప్రేంసాగర్ రావు శనివారం సెక్రెటేరియట్‌లో డిప్యూటీ సీఎం భట్టితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ ఆలోచన ఏంటి? విస్తరణ ఎప్పుడు ఉండొచ్చు? తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? అని ఆరా తీసినట్టు తెలిసింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు భట్టికి సన్నిహితులనే ప్రచారం జరుగుతున్నది. దీనితో వారిద్దరు సెక్రెటేరియట్‌కు వెళ్లి డిప్యూటీ సీఎంతో చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. అలాగే ఆయన కారులో సెక్రెటేరియట్ నుంచి ప్రజాభవన్‌‌కు వెళ్లి అరగంటపాటు భేటీ అయినట్లు సమాచారం.

ఆశావహులు

సామాజిక వర్గం ఎమ్మెల్యేల పేర్లు

రెడ్డి: సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి

బీసీ: వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్య, దానం నాగేందర్

ఎస్సీ: వినోద్, వివేక్, వేముల వీరేశం

ఎస్టీ: బాలునాయక్, రామచంద్రం నాయక్, మురళీనాయక్

వెలమ: ప్రేంసాగర్ రావు

Next Story