తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. బంధువులు, వారసులకు ఇక నో చాన్స్

by Gantepaka Srikanth |

జిల్లా కాంగ్రెస్​కమిటీ (డీసీసీ) అధ్యక్షులుగా కొత్త వారికి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్​నిర్ణయించింది.

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. బంధువులు, వారసులకు ఇక నో చాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా కాంగ్రెస్​కమిటీ (డీసీసీ) అధ్యక్షులుగా కొత్త వారికి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్​నిర్ణయించింది. అదే సమయంలో నాయకుల వారసులు, దగ్గరి బంధువులకు, ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారికి మళ్లీ అవకాశం ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నది. ఇందులో భాగంగా 22 మందిని ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. వారు ఆయా జిల్లాల్లో గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. పరిశీలకులందరూ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారు కావడం విశేషం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డీసీసీ అధ్యక్షులుగా నియామకమైన వారే ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరిలో చాలా మంది వివిధ హోదాలు పొందారు. దీంతో తమ స్థానంలో కొత్త వారిని నియమించాలని కొంత కాలంగా కోరుతున్నారు.

అభ్యర్థుల ఎంపికలో కీలకం

పార్టీ కార్యక్రమాల రూపకల్పన, వాటి అమలు, అభ్యర్థుల ఎంపిక తదితర వాటన్నింటిని డీసీసీల ద్వారానే చేపట్టాలని ఏఐసీసీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీకి మరింత జవసత్వాలు రావడానికి డీసీసీల బలోపేతం సైతం ఒక భాగమని గుర్తించారు. డీసీసీ నుంచి సిఫార్సు చేసే పేర్లలోనే ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేయాలని, దీని ద్వారా సెలెక్ట్, ఎలక్ట్​విధానాన్ని అవలంభించాలని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేశాయి. ఈ ఏడాది మొదట్లో ప్రస్తుత డీసీసీలకు శిక్షణ సైతం ఇచ్చారు.

ఎమ్మెల్యేలుగా ఎన్నికైన డీసీసీలు

కరీంనగర్​డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్​కుమార్, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్, సిరిసిల్ల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​రెడ్డి, వికారాబాద్​జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్​రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి, నాగర్​కర్నూలు జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా సికింద్రాబాద్​జిల్లా అధ్యక్షుడు అనిల్​కుమార్​యాదవ్​ఎంపీగా, నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్​నాయక్​ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి కార్పొరేషన్ పదవులు పొందారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖ భర్త ప్రేమ్​సాగర్​రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరికొందరికి టికెట్ దక్కినా విజయం సాధించలేదు. ఇలా దాదాపుగా గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మందికి ఏదో ఒక పదవి లభించింది. దీంతో వారంతా బిజీ అయిపోయారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలు విజయవంతం కావాలంటే రాష్ట్ర స్థాయిలో పదే పదే ఫాలోఅప్​చేయాల్సి వస్తుందని గుర్తించారు. కొత్త వారికి, ఏ పదవి లేని వారికి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, ఉత్సాహంగా పనిచేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటన్నింటిని వడబోసి ఐదుగురి పేర్లను ఏఐసీసీకి సిఫార్సు చేస్తారు. వారందరి వివరాలను మరోసారి పరిశీలించి షార్ట్‌ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ సైతం చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటుగా సామాజిక సమీకరణాలను ఫాలో కానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు ఇలా అందరికీ అవకాశం కల్పించనున్నారు.​అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేండ్లు సమయం ఉన్నందున ఆ ఎన్నికలు ముగిసే వరకు వీరే డీసీసీ అధ్యక్షులుగా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

డీసీసీ అధ్యక్షులతో మీటింగ్

డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునే వారు కనీసం 5 ఏండ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పని చేసి ఉండాలని సూచించారు. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు రెండోసారి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గరి బంధువులకూ చాన్స్ లేదని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని, ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు.

Next Story