గత ఎన్నికల్లో ఆదుకున్న జిల్లాపై Congress ఫోకస్ కరువు!

by GSrikanth |
గత ఎన్నికల్లో ఆదుకున్న జిల్లాపై Congress ఫోకస్ కరువు!
X

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 'ఖమ్మం' ఆదరించింది. పది సెగ్మెంట్లకు గాను ఆరింటిని కట్టబెట్టింది. అలాంటి ప్రాంతంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ కరువైంది. ఉమ్మడి ఖమ్మం నుంచి హస్తం తరపున ఆరుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, వారిలో నలుగురు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి దీటుగా నియోజకవర్గ బాధ్యతలను కాంగ్రెస్ నాయకత్వం ఇతర లీడర్లకు అప్పగించలేదు. టికెట్టుపై కూడా ఎవరికీ స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ కేడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు టికెట్టు రేసులో ఉండగా, ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్య నేతలంతా కేవలం గాంధీభవన్‌కే పరిమితమవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఎన్నికల్లో నాలుగు ఎస్టీ, ఒక ఎస్సీతో పాటు జనరల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగరేసింది. మరొక అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థికి ఇంటర్నల్ సపోర్టు చేసి గెలిపించిందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అధికార పార్టీని కాదని ప్రజలు ఏకంగా ఆరు సీట్లను కాంగ్రెస్ కు కట్టబెట్టారంటే క్షేత్రస్థాయిలోని పార్టీ క్యాడర్ పనితీరు ను అర్థం చేసుకోవచ్చు. కానీ రాష్ట్ర నాయక త్వం మాత్రం ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఆదుకునే చర్యలేవీ తీసుకోవడం లేదు. కాంగ్రె స్ గుర్తుతో గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ లోకి పోయినప్పటికీ కేవలం కొద్ది శాతం క్యాడరే వాళ్లతో వెళ్లిందనే చర్చ జరుగుతున్నది. ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ క్యాడర్ ను గుంజుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ క్యాడర్ ను కాపాడుకోవడానికి, కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఇన్ చార్జిలెవరూ ప్రయత్నం చేయడం లేదని సమాచారం. దీంతో పార్టీలో ఉండాలా? వేరే పార్టీలోకి వెళ్లాలా? అని పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి.

పోటీలో ఎవరెవరంటే..?

మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య గెలుపొందారు. ఆ స్థానాల నుంచి దాదాపుగా వీరికే టికెట్లు కన్ఫామ్. కానీ మిగతా సెగ్మెంట్లలో అభ్యర్థులపై కన్ఫ్యూజన్ నెలకొన్నది. అశ్వరావు పేట్ నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు సున్నం నాగమణి, వగ్గెల పూజ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లోకి చేరిన తాటి తనకే పార్టీ టికెట్ లభిస్తుందని ఆశతో ఉన్నారు. 2009 నుంచి ప్రయత్నాలు చేస్తున్నందున ఈ సారి టికెట్ తనకే ఇస్తారని నాగమణి చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వగ్గెల పూజ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి ఉస్మానియా ఉద్యమకారుడు, ప్రస్తుత టీపీసీసీ జనరల్ సెక్రటరీ మానవతా రాయ్, మాజీ మంత్రి ఎస్. చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు. రాయ్ కే మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాయ్ ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొత్తగూడెం జనరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎడవెల్లి కృష్ణ, కోట్ల నాగేశ్వరరావు, పినపాకలో సీతక్క కొడుకు సూర్య, చండ్ర సంతోశ్, ఇల్లందులో చీమల వెంకటేశ్వర్లు, పాలేరులో రాయల నాగేశ్వరరావు, మాధవి రెడ్డి, వైరాలో రాందాస్ నాయక్, రామ్మూర్తి నాయక్ టిక్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఖమ్మం టౌన్ లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రేణుకా చౌదరికే టికెట్ లభిస్తుందని చర్చ జరుగుతున్నది. అయితే పార్టీ అధిష్టానం టికెట్లపై త్వరగా క్లారిటీ ఇస్తే పార్టీ నష్టపోకుండా ఉంటుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Also Read...

BRS తొలి బహిరంగసభకు ఆ ఇద్దరు ఎందుకు రాలే?

Next Story

Most Viewed