- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా స్మితా సబర్వాల్ తీరు.. ఇష్యూ పెద్దదని తెలిసి కూడా వరుస ట్వీట్లు
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యవహరశైలిపై సీఎంవో సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యవహరశైలిపై సీఎంవో సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించడం, ఆ తరువాత దానిని కొనసాగిస్తూ వివాదాన్ని మరింత పెద్దగా చేసే ప్రయత్నం చేస్తుండటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కంచ గచ్చిబౌలిలో చెట్ల తొలగింపు వ్యవహారం సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి సైతం స్పందించే స్థాయి వెళ్లింది. ఏఐ ఫొటోలతోనే ఈ సమస్యంతా వచ్చిందని సర్కారు భావిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇందులో పొలిటికల్ లీడర్స్ తోపాటు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని సమాచారం. అంత పెద్ద ఇష్యూ అవుతుంటే.. తెలిసి కూడా దానిని మరింత పెద్దదిగా చేసేలా వ్యవహరించడం సీఎంవో ఆగ్రహానికి కారణంగా తెలుస్తున్నది.
అప్పుడెందుకు రెస్పాండ్ కాలేదు?
బీఆర్ఎస్ హయాంలో స్మితా సబర్వార్ తొమ్మిదేళ్లు పని చేశారు. మరీ ముఖ్యంగా సీఎంవోలో నీటిపారుదల శాఖ వ్యవహరాలను ఆమె చూశారు. అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఆ సందర్భంలో లక్షల చెట్లను కొట్టేశారు. ఈ అంశాన్ని అనేక జాతీయ పత్రికలు కవర్ చేశాయి. అయితే అప్పుడు వేల ఎలకరాల్లో చెట్లు తొలగిస్తే లేని స్పందన ఇప్పుడెందుకు వచ్చిందనే కోణంలో నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. వీరికి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా? అనే కోణంలో వివరాలు తెలుసుకున్నది. దీనికి కొనసాగింపుగానే పోలీసులు స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న చిన్న ఉద్యోగి నుంచి సీఎస్ వరకు ఉద్యోగులకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. వీటి గురించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. గతంలో పలువురిపై కేసులు కూడా అయ్యాయి. అయితే సర్వీస్ కండక్ట్ రూల్స్ తెలిసి కూడా స్మితా సబర్వాల్ ఎందుకు స్పందించారు? అదే అంశాన్ని కొనసాగించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అసలు ఆమెను ఎవరు కాపాడుతున్నారు? చిన్న ఉద్యోగులు ఇదే విధంగా స్పందిస్తే ఉరుకుంటారా? అనే కోణంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎంవో అధికారులు, మీడియా విభాగం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పులను సేకరించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఉద్యోగుల క్రమశిక్షణపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆమె దృష్టికోణంలో మార్పు ఎందుకు?: అయోధ్య రెడ్డి
కాళేశ్వరం కడుతున్న సమయంలో లక్షల చెట్లను నరికివేసినా.. బీఆర్ఎస్ హయాంలో సీఎంవోలో నీటిపారుదల శాఖ చూస్తున్న స్మితా సబర్వాల్ కు ప్రకృతి గురించి గుర్తుకు రాలేదా అని సీపీఆర్వో అయోధ్యరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్షల చెట్లను కొట్టివేస్తున్నారంటూ వివిధ జాతీయ పత్రికలు రాసిన కథనాలను శనివారం ఆయన ట్వీట్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ స్మితా సబర్వాల్ వైఖరి ఎందుకు మారిందని ప్రశ్నించారు. ‘అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా? అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన వీరే.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏమిటో? అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా? అని ప్రశ్నించారు.
నోటీసులు నా ఒక్కదానికేనా: పోలీసుల నోటీసుపై స్మితా సబర్వాల్ స్పందన
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తాను రీ ట్వీట్ చేసిన పోస్టును మరో రెండు వేల మంది కూడా రీ ట్వీట్ చేశారని, తనతోపాటు వారందరికీ నోటీసులు ఇచ్చారా? అని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. శనివారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మార్చి 31న చేసిన ట్వీట్ పై పోలీసులు ఈనెల 12న స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు దీంతో పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్మితా సబర్వాల్ చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు.
స్మితా తీరుపై నెటిజన్లు ఫైర్.. సోషల్ మీడియాలో ఆగ్రహం
స్మితా సబర్వాల్ ట్వీట్ పై పలువురు స్పందించారు. ‘మీరు ప్రభుత్వ అధికారి. సర్కారు పాలసీని పాటించడం మీ పని. రాజకీయాలు చేయడం కాదు. గత ప్రభుత్వ అరాచకాలపై ఒక్కసారి అయినా మీరు మాట్లాడారా? అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘మీరు కేసీఆర్, కేటీఆర్ సైడ్ తీసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అంటూ నిలదీశారు. ‘ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకతంగా బహిరంగంగా స్పందిస్తారా? ఇవేనా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్ చెబుతున్నది’ అంటూ మరొకరు ప్రశ్నించారు. పాలిటిక్స్ చేయాలనుకుంటే ఐఏఎస్ కు రాజీనామా చేసి రాజకీయ పార్టీలో చేరాలంటూ మరొకరు సూచించారు. ‘ఈ రెండు వేల మందికి కామన్ సెన్స్ లేదు కావచ్చు.. ఐఏఎస్ అధికారిగా ఉన్న మీకు కూడా కామన్ సెన్స్ లేదా? అంటూ కామెంట్ చేశారు. గతంలో మీరు మంచి ఆఫీసర్ గా ఉండే వారని, కానీ ఇప్పుడు వివాదస్పద ఆఫీసర్ గా మారుతున్నారని, ఈ ప్రభుత్వం అంటే మీకుఇష్టం లేదా? అని మరొక నెటిజన్ ప్రశ్నించారు.






