తెలంగాణ కుల గణన రిపోర్ట్: 46.25 శాతంతో అగ్రస్థానంలో బీసీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-16 04:13:24  IST  )

తెలంగాణ ప్రభుత్వం 97.10% కుల గణనను పూర్తి చేసి, రాష్ట్ర సామాజిక ముఖచిత్రాన్ని విడుదల చేసింది.

తెలంగాణ కుల గణన రిపోర్ట్: 46.25 శాతంతో అగ్రస్థానంలో బీసీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సర్వే (SEEEPC) ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా అత్యంత పారదర్శకమైన పద్ధతుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సామాజిక న్యాయం, సమానత్వం సాధించడంలో ఈ నివేదిక ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

97.10 శాతం సర్వే పూర్తి..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను సందర్శించి, అంటే దాదాపు 97.10 శాతం సర్వేను పూర్తి చేయడం గమనార్హం. సుమారు ఒక లక్షా మూడు వేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ‘సెల్ఫ్ డిక్లరేషన్’ పద్ధతిలో సమాచారాన్ని సేకరించారు. మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 మంది జనాభా వివరాలను పకడ్బందీగా క్రోడీకరించారు. తాము సేకరించిన ఈ ప్రామాణికమైన డేటాను కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకోవాలని, మందబలంతో కాకుండా శాస్త్రీయంగా జనగణన చేపట్టాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది.

రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36 శాతం

ఈ సర్వే ద్వారా వెల్లడైన సామాజిక వర్గాల బలాబలాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం జనాభాలో బీసీలు 56.36 శాతంగా ఉండగా, ఎస్సీలు 17.42 శాతం, ఎస్టీలు 10.43 శాతం మరియు ఓసీ వర్గాలు 15.79 శాతంగా నమోదయ్యాయి. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుమారు 4 శాతం మంది ప్రజలు తమకు ఎలాంటి కులం లేదని (No Caste) పేర్కొన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్తులో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారుకు మరియు సంక్షేమ పథకాల రూపకల్పనకు దిక్సూచిగా మారనున్నాయి.

మాదిగలే టాప్..

కులాల వారీగా వివరాలను చూస్తే.. మాదిగ సామాజిక వర్గం 36.58 లక్షల మందితో (10.3%) రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత షేక్ ముస్లింలు 27.96 లక్షలతో (7.9%), ముదిరాజ్ వర్గం 26.39 లక్షలతో (7.4%) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే లంబాడ/బంజారా (6.8%), యాదవ (5.7%), రెడ్డి (4.8%), గౌడ్ (4.6%), మాల (4.1%), మరియు మున్నూరుకాపు (3.9%) సామాజిక వర్గాలు టాప్-10 జాబితాలో ఉన్నాయి. ఈ సమగ్ర సర్వే వివరాలన్నింటినీ సామాన్య ప్రజల అందుబాటు కోసం des.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉంచారు.

చట్టసభల్లో మహిళా గర్జన: 33% రిజర్వేషన్లతో చిగురించిన ఆశలు!

Next Story