తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. 3 కొత్త వ్యవసాయ కళాశాలలకు ఆమోదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-16 13:48:13  IST  )

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. 3 కొత్త వ్యవసాయ కళాశాలలకు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4.30కి ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు ఆమోదం తెలిపారు. వాటిని నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.

అదేవిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్‌లో చర్చిస్తున్నారు. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని, రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు కూడా ఆమోదం తెలిపారు. ఆ ప్రాజెక్టుకు ఆయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ఇక రూ.10,547 కోట్లతో 5,566 కి.మీ మేర ప్రతిపాదించిన హ్యామ్‌ రోడ్ల ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

Next Story