Telangana Cabinet Meeting: 30న తెలంగాణ కేబినెట్ భేటీ..సంక్రాంతికే రెండు రైతు పథకాలు !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-24 06:12:17  IST  )

తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting)ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరుగనుంది.

Telangana Cabinet Meeting: 30న తెలంగాణ కేబినెట్ భేటీ..సంక్రాంతికే రెండు రైతు పథకాలు !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting)ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరుగనుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు దిశగా ఈ దఫా మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంక్రాంతి నుంచి అందిస్తామన్న రైతు భరోసా(Rythu Bharosa) ఎకరాకు ఏడాదికి రూ.15వేలు అందించే పథకంతో పాటు భూమిలేని పేదలకు రూ.12వేలు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ, వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు వెలువరించనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా అంశంపై ఇప్పటికే చర్చించిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో పథకానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా అందించడంపై ప్రకటన జారీ చేయనుంది.

అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటు అంశంపై కూడా చర్చించే అవకాశముంది. తన పుట్టినరోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్న సందర్భంగా యాదగిరిగుట్టకు బోర్డును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 20 మందితో బోర్డు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రాథమిక నిర్ణయం తీసుకోగా.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి బోర్డు ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనున్నారు. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా సంక్రాంతి నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉభయసభల్లో ప్రకటించారు.

కొత్త రేషన్‌కార్డులకు సుమారు 10 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటికే ఉన్నకార్డు ల్లో అదనంగా సభ్యుల చేర్పులకు 26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు చేయడంపైన, డిజిటల్‌ కార్డులను పంపిణీపైన కేబినెట్ లో చర్చించి సంక్రాంతి నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయడంపై తగిన నిర్ణయం ప్రకటించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశముంది. మొత్తంగా ఈనెల 30న జరుగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీ రైతులు, పేదల సంక్షేమం దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనుండటంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story