వక్ఫ్‌ సవరణ చట్టంపై తెలంగాణ‌ బీజేపీ ఆఫీసులో వర్క్‌షాప్‌

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-17 10:14:43  IST  )

వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై త‌మ పార్టీ నేత‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు తెలంగాణ బీజేపీ క‌స‌రత్తు చేస్తోంది.

వక్ఫ్‌ సవరణ చట్టంపై తెలంగాణ‌ బీజేపీ ఆఫీసులో వర్క్‌షాప్‌
X

దిశ, వెబ్ డెస్క్: వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై త‌మ పార్టీ నేత‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు తెలంగాణ బీజేపీ క‌స‌రత్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ లోని పార్టీ ఆఫీసులో వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. చ‌ట్టంపై పార్టీ నేత‌ల‌కు అవ‌గాహ‌న ఉండాల‌ని వ‌ర్క్ షాప్ నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది.జిల్లాకు ముగ్గురు చొప్పున క‌మిటీలు వేసి ఈనెల 20 నుండి జిల్లాల్లోని నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు చ‌ట్టం గురించి వివ‌రించేందుకు జ‌న‌జాగ‌ర‌ణ అభియాన్ కార్య‌క్రమం నిర్వ‌హించేలా ప్లాన్ సిద్దం చేశారు.

15 రోజుల పాటూ ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ... వక్ఫ్ బోర్డుతో ఒవైసీ బ్రదర్స్‌ అనుచరులకే లాభం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వక్ఫ్‌బోర్డును అడ్డం పెట్టుకొని దోపిడీచేస్తున్నారని అన్నారు. చట్టంలో కలెక్టర్‌కు అధికారాలు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. ఇందులో మహిళల భాగస్వామ్యం కూడా ఉందని భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. వక్ఫ్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇకపై నాయకుల ఇళ్లలో కాకుండా కంప్యూటర్‌లో ఉంటాయని చెప్పారు.

వక్ఫ్‌బోర్డుతో ఎంత మందికి లాభం చేశారో రాహుల్, అసదుద్దీన్ చర్చకు సిద్ధమా అని ప్ర‌శ్నించారు. హైదరాబాద్‌లో 70 శాతం వక్ఫ్ భూములను కాంగ్రెస్, ఒక మతానికి చెందిన నేతలు కబ్జా చేశారని అన్నారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరని చెప్పారు. ఇదిలా ఉంటే వ‌క్ఫ్ బోర్డు చ‌ట్టంలో మార్పులు చేయ‌డం దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నాయి. ప‌ట్ట‌ణాలు న‌గ‌రాల్లోనే కాకుండా వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా గ్రామాల్లోనూ నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో విమ‌ర్శ‌లను తిప్పికొట్టాల‌ని క‌మ‌లం నేత‌లు నిర్ణ‌యం తీసుకున్నారు.

Next Story