- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీరబాలల త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకం: ఎన్.రాంచందర్ రావు
దేశం, ధర్మం, భారతీయ సంస్కృతి రక్షణ కోసం ప్రాణాలర్పించిన గురు గోవింద్ సింగ్ జీ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌ల త్యాగం చిరస్మరణీయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశం, ధర్మం, భారతీయ సంస్కృతి రక్షణ కోసం ప్రాణాలర్పించిన గురు గోవింద్ సింగ్ జీ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌ల త్యాగం చిరస్మరణీయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీర బాల్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వీరబాలల చిత్రపటాలకు నివాళులర్పించి, వారి బలిదానాన్ని స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేవలం 7, 9 ఏళ్ల ప్రాయంలోనే మొఘలుల అరాచకాలను ఎదిరించి, మతం మారే ప్రసక్తే లేదని ప్రాణాలర్పించిన ఆ చిన్నారుల ధైర్యం రాబోయే తరాలకు మార్గదర్శకమని కొనియాడారు. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 26ను వీర బాల్ దివస్ గా ప్రకటించడం ద్వారా సిక్కు పంత్ త్యాగాలకు దేశవ్యాప్త గౌరవం దక్కిందని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో సిక్కు సమాజానికి చారిత్రక న్యాయం జరిగిందని రాంచందర్ రావు వివరించారు. వందల కోట్ల వ్యయంతో కారిడార్‌ను పూర్తి చేసి పాకిస్థాన్‌లోని పవిత్ర గురుద్వారాల సందర్శనకు వీలు కల్పించారన్నారు. గురుద్వారాల్లో జరిగే లంగర్ సరుకులపై పన్నులు తొలగించడం ద్వారా సిక్కు సమాజానికి రూ. 325 కోట్ల ఆర్థిక భారం తగ్గిందన్నారు. సిక్కు విద్యార్థులకు గతంలో ఉన్న రూ. 18 కోట్ల విద్యా సహాయాన్ని మోదీ ప్రభుత్వం రూ. 31 కోట్లకు పెంచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కుల మారణహోమంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి, దోషులను శిక్షించేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు రాంచందర్ రావు సికింద్రాబాద్‌లోని గురుద్వారాను సందర్శించి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో కీర్తనలు, ప్రత్యేక సమావేశం నిర్వహించి వీరబాలల స్ఫూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






