ఇరకాటంలో తెలంగాణ ‘బీజేపీ’.. బీసీ రిజర్వేషన్లపై సైలెంట్

by Kema Shiva Kumar |

రాష్ట్ర బీజేపీకి బీసీ రిజర్వేషన్ల అమలు సంకటంగా మారింది.

ఇరకాటంలో తెలంగాణ ‘బీజేపీ’.. బీసీ రిజర్వేషన్లపై సైలెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీకి బీసీ రిజర్వేషన్ల అమలు సంకటంగా మారింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ఎత్తులు వేసి కమలనాథులే ఇబ్బందుల్లో పడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, తాము చేయా ల్సింది చేశామని.. రిజర్వేషన్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉన్నదని రేవంత్ ​సర్కార్ ప్రజలకు వివరిస్తున్నది. రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపిన కమలం పార్టీ.. కేంద్రంలో బిల్లు పెట్టేందుకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నిస్తున్నది. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిల్లు పెట్టేదని, దీనిపై రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నదనే ప్రచారం చేస్తున్నది. బీసీల కోసం తాము పాటు పడుతుంటే మోడీ ప్రభుత్వం మోకాలడ్డు పెడుతూ తమను దోషులుగా చేసేందుకు కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్ ​నేతలు ప్రసంగాలు దంచుతున్నారు. వీరి విమర్శలకు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో తెలియక జిల్లా, మండల బీజేపీ సెకండ్ ​కేడర్​ తర్జనభర్జన పడుతోంది. బీసీ సంఘాలు మీ వైఖరి ఏమిటో తెలపాలని నిలదీస్తుంటే ఎటూ చెప్పలేక మౌనంగా ఉండే దుస్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే టీబీజేపీకి ఓసీ నేతను అధ్యక్షుడిని చేశారన్న అపవాదు కమలం పార్టీని వెంటాడుతున్నది.

బీసీ అవకాశాలపై వివరించే ప్లాన్..

బీసీ రిజర్వేషన్లపై తమను ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్ ​వ్యుహాలను ఎదుర్కొనేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్లాన్ ​చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్..​తన మంత్రి వర్గంలో ఎంతమంది బీసీ మంత్రు లు, ఎన్ని రాష్ట్రాలకు బీసీ అధ్యక్షులు, గతంలో రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులకు అవకాశం కల్పించిన జాబితాను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అదే విధంగా తెలంగాణలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన బీసీ, ఎస్సీ నాయకుల వివరాలను ప్రజలు ముందు ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

బిల్లుకు మద్దతివ్వకపోతే ఓటమే..

త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్​ చెబుతుంటే బీజేపీ మాత్రం మౌనంగా ఉండిపోయింది. బీసీ కులగణనలో ముస్లింలను కలపడం తాము వ్యతిరేకిస్తున్నామని, మతపరమైన రిజ్వరే‌షన్లకు తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పడం మినహా బీసీలపై తమ స్టాండ్ ఏమిటో చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నుంచి వరుసగా ఎన్నికల జాతర ఉంటుందని, వాటిలోనైనా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామనే ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. బీజేపీ పెద్దలు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై విధానం ప్రకటించకపోతే క్షేత్రస్థాయిలో కమలం పార్టీ ఉనికి కనుమరుగు అవుతుందని అంటున్నారు. ఇదే తీరుతో వ్యవహరిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ఎవరూ ముందుకు రారని బాహాటంగా చెబుతున్నారు.

బీసీ వాదం పని చేయదంటున్న బీజేపీ పాత వర్గం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన చేస్తే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు గెలువలేదని, త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ నినాదం పనిచేయదని కొందరు సీనియర్లు పార్టీకి సూచిస్తున్నట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్​విపక్ష పార్టీలను ఆందోళనకు గురిచేయడం తప్ప మరోకటి లేదన్నారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్​మంత్రివర్గంలో కనీసం ఆరుగురు మంత్రులుగా, 30 మందిని కార్పొరేషన్లకు చైర్మన్లు చేయాలని ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా బీఆర్‌ఎస్​ఆ పార్టీకి అధ్యక్షుడు కానీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. ఆ రెండు పార్టీల ట్రాప్‌లో పడకుండా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని హైకమాండ్‌కు సూచనలు చేస్తున్నట్లు టాక్​వినిపిస్తోంది.

Next Story