- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన పేరు వింటే హృదయం గర్వపడుతది: తెలంగాణ బీజేపీ చీఫ్
సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయం గర్వంతో నిండుతుందని, ఆయన కృషితోనే తెలంగాణ భారతదేశంలో భాగమైందని రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయం గర్వంతో నిండుతుందని, ఆయన కృషితోనే తెలంగాణ భారతదేశంలో భాగమైందని రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం కోసం కొన్ని పార్టీలు సత్యాన్ని దాచిపెట్టినా, తమ పార్టీ మాత్రం నిజమైన చరిత్రను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. ఆదివారం పార్టీ రాష్ర్ట ర్యాలయంలో పటేల్150 రాష్ట్ర స్ధాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా జరపకపోయినా, మోడీ ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుతోందన్నారు. దేశ ఏకీకరణలో సర్దార్ పటేల్ పాత్ర అమోఘం. 560 సంస్థానాలను ఒక్క జెండా కింద కలిపి భారతదేశాన్ని ఏకం చేశారు. ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా” అనే బిరుదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ సరిపోయేవి. జూనాగఢ్, హైదరాబాద్ , కాశ్మీర్ వంటి ప్రాంతాలను కూడా భారతదేశంలో విలీనం చేసిన నాయకుడు అనే సంగతి నేటి పాలకులు మరిచిపోవద్దన్నారు.
ఇతర రాజకీయ పార్టీలు ఆయనను మర్చిపోయినా, దేశభక్తి గల బీజేపీ మాత్రం ఆయనను ఎప్పటికీ స్మరిస్తుంది. ఆయన కాంగ్రెస్ నాయకుడైనా, ఆయన దేశ సేవ మనకు స్ఫూర్తి అన్నారు. ఇప్పుడు ఈ దేశం మీద విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చి దేశాన్ని విడదీయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేస్తే, అదే పార్టీలోని కొంతమంది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ హయాంలో నక్సలిజం నిర్మూలించడం కష్టం అనే పరిస్థితి ఉండగా, నేటి హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నక్సలిజాన్ని పూర్తి నిర్మూలిస్తామన్న మాట నిలబెట్టుకున్నారు. అమిత్ షా ఈ తరం సర్దార్ పటేల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన కఠినమైన నిర్ణయాలతో దేశం అంతటా శాంతి స్థాపన సాధించారు.
తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇటీవలే సరెండర్ అయిన నక్సలైట్లు వెల్లడించారని ఇది చాలా సీరియస్ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానిపై విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలి. పోలీసు కుటుంబాలు, కానిస్టేబుళ్ల ప్రాణాలను బలిగొన్న నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహించారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. త్వరలోనే మూడో స్థానంలోకి చేరుతుంది. భారతదేశం ఒక్కటే దేశం. కులం, మతం, భాష, ప్రాంతం అనే పేర్లతో దేశాన్ని విభజించాలనుకునే ఎవరి కుట్రలూ విజయం సాధించవు. దేశ ఏకత్వాన్ని కాపాడేది కేవలం మోడీ ప్రభుత్వమేనన్నారు.






