మెగాస్టార్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్‌‌.. స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-22 07:13:22  IST  )

టాలీవుడ్ కింగ్, మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రత్యేకంగా భేటీ కావడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మెగాస్టార్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్‌‌.. స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో భారతీయ జనతా పార్టీ (BJP) చీఫ్ రామచందర్ రావు (Ramchander Rao) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో జరిగిన ఈ సమావేశం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మోదీ ప్రభుత్వ సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులకు, ప్రజలకు చేరవేసే ‘మహా‌జన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఈ భేటీలో భాగంగా ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనా ప్రగతికి సంబంధించిన స్పెషల్ బుక్, బ్రోచర్లను చిరంజీవికి రామచందర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధిపై ఇరు ప్రముఖుల మధ్య చర్చ సాగినట్లుగా సమాచారం. కాగా, ఇద్దరి సమావేశం పూర్తిగా మర్యాదపూర్వకమైనదని, ప్రభుత్వ విజయాలను వివరించడానికే మెగాస్టార్‌ను కలిశామని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.

మెగాస్టార్ బీజేపీలో చేరబోతున్నారా?

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రామచందర్ రావుల భేటీ మోదీ ప్రభుత్వ విజయాలను వివరించడానికేనని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం సరికొత్త చర్చకు తెరలేచింది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారా.. ఒకవేళ వస్తే బీజేపీలో చేరే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే ఎన్డీఏ (NDA) కూటమిలో భాగస్వామిగా ఉండటంతో, తాజా సమీకరణాలు చిరంజీవిని కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకునేలా చేస్తాయా అని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

Next Story