- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల సర్వే నివేదికలపై తెలంగాణ బీసీ కమిషన్ లోతైన విశ్లేషణ: ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 నివేదిక, స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ నివేదికలపై తెలంగాణ బీసీ కమిషన్ కూలంకషంగా చర్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 నివేదిక మరియు స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ నివేదికలపై తెలంగాణ బీసీ కమిషన్ కూలంకషంగా చర్చింది. వీటిని మరింత లోతుగా విశ్లేషించడానికి కమిషన్‌లోని సీనియర్ అధికారుల బృందంతో ఒక కమిటి ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆ కమిటి నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్ ఈ కుల సర్వే విషయంలో తమ పరిశీలనను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపైన చర్చించింది. ప్రధానంగా నిపుణుల నివేదికలో గంగపుత్ర, బేస్త మరియు గూండ్ల కులాలకు సంక్షిప్త నామంగా అగ్నికుల క్షత్రియ పేరుతో వ్యవహరించడం పట్ల అభ్యంతరాలను తెలుపుతూ ఆయా కులాల ప్రతినిధులు కమిషన్‌కు నివేదించారని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ విషయాన్ని చర్చించిన కమిషన్ మరికొన్ని ఇతర కులాల విషయంలో కూడా సంక్షిప్త పేర్లు ప్రధాన కుల పేర్లకు విరుద్ధంగా ఉండడాన్ని కమిషన్ గుర్తించిందన్నారు. ఈ విషయాన్ని సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరాలని కమిషన్ నిర్ణయించిందని నిరంజన్ తెలిపారు. 2025లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులు, సర్పంచుల వివరాల సేకరణపై పంచాయితీరాజ్ కమిషనర్‌తో చర్చించాలని కమిషన్ నిర్ణయించిందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా గణనలో భాగంగా తేది ఈనెల 26 నుంచి ప్రారంభమైన స్వీయగణనలో ప్రజలందరూ పాల్గొనాలని, 2వ విడతలో తమ కుల వివరాలు నమోదు చేసుకోవాలని నిరంజన్ కోరారు. కుల సంఘాలు మరియు ప్రతినిధులు కూడా తమ కులస్తుల జనాభా నమోదయ్యేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 130 వెనుకబడిన తరగతుల కులాల నమోదు కొరకు సెన్సెస్ వారు తీసుకుంటున్న చర్యలను వివరించాలని తెలంగాణ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్‌కు లేఖ రాయాలని కమిషన్ నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






