- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఐపీఎస్ పోస్టులు పెరిగేనా? : ఆమోదం కోసం ఎదురుచూపులు
రాష్ట్రంలో పెరిగిన పరిపాలన అవసరాలు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఐపీఎస్ అధికారుల సంఖ్యను గణనీయంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరిగిన పరిపాలన అవసరాలు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఐపీఎస్ అధికారుల సంఖ్యను గణనీయంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రానికి కేటాయించిన 151 ఐపీఎస్ పోస్టుల సంఖ్యను 194కు పెంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం రూపొందించిన మిడ్ కేడర్ రివ్యూ నివేదిక ఆధారంగా ఈ మేరకు అదనపు పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఆమోదం కోసం ఆశగా ఎదురుచూస్తున్నది.
పెరిగిన సేవలు
రాష్ట్ర విభజన తర్వాత మారుతున్న భౌగోళిక, పాలనా పరిస్థితులకు అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో కేంద్ర హోంశాఖ వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం.. తెలంగాణ కేడర్‌కు కేటాయించిన మొత్తం ఐపీఎస్ పోస్టుల సంఖ్యను 151గా ఖరారు చేశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు, కమిషనరేట్ల విస్తరణ, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ వంటి ప్రత్యేక విభాగాల పటిష్ఠత నేపథ్యంలో ఈ సంఖ్య ఏమాత్రం సరిపోవడం లేదని పోలీసు శాఖ అంచనా వేసింది.
డీజీపీ నివేదికలో ఏముంది?
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల లభ్యత, అవసరాలను పునఃసమీక్షిస్తూ డీజీపీ కార్యాలయం గతేడాది నవంబర్ 10న ప్రభుత్వానికి ఒక కీలక నివేదిక సమర్పించింది. డీజీపీ ప్రతిపాదించిన మిడ్ కేడర్ రివ్యూ ప్రకారం.. రాష్ట్రానికి మొత్తం 194 మంది ఐపీఎస్ అధికారుల కేడర్ స్ట్రెంత్ అవసరమని స్పష్టం చేశారు. డీజీపీ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు కేడర్‌ను పెంచాలని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ 25న కేంద్ర హోంశాఖకు అధికారికంగా లేఖ రాసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో నెలకొన్న అవసరాలు, భవిష్యత్తులో రాబోయే పరిపాలన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు 43 పోస్టులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
కేంద్ర నిర్ణయం కీలకం
డీజీపీ ప్రతిపాదనలపై కేంద్ర హోంశాఖ నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కేడర్ అధికారుల కొరత తీరడమే కాకుండా.. డీఐజీ, ఐజీ, ఏడీజీ స్థాయి అధికారుల పదోన్నతులకు మార్గం క్లియర్ అవుతుంది. అలాగే జిల్లాల్లో ఎస్పీస్థాయి అధికారుల నియామకాలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ కేడర్ పెంపు ఎంతో కీలకమని, కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






