స్వరాష్ట్రంలోనూ స్వాతంత్ర్యం రాని గిరిజనుల తండాలు!

by Malleboina Mahesh |

ఏళ్లు మారుతున్న, పాలకులు, ప్రజా ప్రతినిధులు మారుతున్న తండాల్లో ఉన్న గిరిజన ప్రజల ఆశలు మాత్రం ఆవిరైపోతూనే ఉన్నాయి.

స్వరాష్ట్రంలోనూ స్వాతంత్ర్యం రాని గిరిజనుల తండాలు!
X

దిశ, జడ్చర్ల: దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఎనిమిది పదులు గడుస్తున్నా, స్వరాష్ట్రం తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయినా ఆ గిరిజన తండాల తలరాతలు మాత్రం మారడం లేదు. ఏళ్లు మారుతున్న, పాలకులు, ప్రజా ప్రతినిధులు మారుతున్న ఇక్కడి గిరిజన ప్రజల ఆశలు మాత్రం ఆవిరైపోతూనే ఉన్నాయి. నూతన గ్రామ పంచాయతీలుగా అవతరించాయన్న ముచ్చట తప్ప కనీస వసతులకు నోచుకోక, సరైన రోడ్డు సౌకర్యం లేక దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పెద్దాదిరాల రెవెన్యూ గ్రామం నుంచి విడిపోయి నూతన పంచాయతీగా ఆవిర్భవించిన నేలబండ తండా, దాని పరిధిలోని వాయిలగడ్డ తండాల గిరిజనుల ఆవేదన ఇది!

బురదమయంగా 'మట్టి' దారులు

పెద్దాదిరాల నుంచి నేలబండ తండా, వాయిలగడ్డ తండాలకు వెళ్లే 3 నుంచి 4 కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా అద్వానంగా తయారైంది. ఈ తండాలకు అనుసంధానంగా ఉన్న మిగతా మూడు మార్గాలు కూడా మట్టి రోడ్లే కావడం గమనార్హం. నియోజకవర్గంలోనే సరైన రోడ్డు సౌకర్యం లేని ఏకైక తండాగా నేల బండ నిలుస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డు గుండా ప్రయాణించడం అంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. అడుగు తీసి అడుగు వేయలేని రీతిలో బురదమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, బాటసారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

టెండర్లు వేసేవారే ఏరీ?

గత ప్రభుత్వ హయాంలో ఈ తండాకు 3.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.45 లక్షల నిధులు మంజూరయ్యాయి. అధికారులు రెండు సార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయడానికి ముందుకు రాలేదు. నియోజకవర్గంలో మిగతా గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల నిర్మాణానికి పోటీపడే టెండర్ దారులు గిరిజన తండా అనగానే ఎందుకు వెనకడుగు వేస్తున్నారని తండావాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈపాటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రోడ్డు నిర్మాణం పూర్తి చేసేవారని మండిపడుతున్నారు.

పాదయాత్ర హామీ ఏమైంది?

పాదయాత్ర సమయంలో ప్రస్తుత జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని గిరిజనులు కోరుతున్నారు. గతంలో 'ప్రజాహిత పాదయాత్ర' సమయంలో నేలబండ, వాయిలగడ్డ తండాలను సందర్శించిన అనిరుధ్ రెడ్డి.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి నెలలోనే బీటీ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేస్తానని మాటిచ్చారని గుర్తు చేస్తున్నారు. గెలిచిన తర్వాత తండా వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం తమను తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు మంజూరు చేయడంతో పాటు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

హెచ్చించిన నిధులతోనే ప్రయోజనం

వర్షాకాలంలో కాలినడకన వెళ్లడమూ సాధ్యం కావడం లేదు. గతంలో మంజూరైన రూ.45 లక్షలు ఈ రోడ్డు నిర్మాణానికి చాలకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. తండా ప్రజల అవస్థలను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బీటీ రోడ్డు మంజూరయ్యేలా కృషి చేస్తాం.:- పాత్లావత్ జయమ్మ శ్రీనివాస్ (సర్పంచ్, నేల బండ తండా

Next Story