- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘NEET’ సమస్య కాదు, ‘AI’ అసలైన ముప్పు: ఆర్జీవీ సంచలన ట్వీట్
విద్యారంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ద్వారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విద్యారంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘NEET’ పరీక్షల లీకేజీలు, పరీక్షల రద్దు, విద్యార్థుల ఆత్మహత్యలు సమస్య కాదని, కృత్రిమ మేధస్సు (AI) వల్ల కలిగే ముప్పు తీవ్రమైనదని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘NEET’ సమస్య వల్ల వ్యవస్థకు తగిలిన గాయం వల్ల రక్తపాతం కనిపిస్తే, AI వ్యవస్థ యొక్క ‘గొంతు కోసేస్తుందని’ ఆర్జీవీ తెలిపారు.
వర్మ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు
“గతంలో చదువు అంటే పరిమితమైన సమాచారాన్ని విద్యార్థులకు అందించడం, వారిని ఊహించిన విధంగా బతికించడానికి సిద్ధం చేయడం. కానీ ఇప్పుడు సమాచారం కొరత లేదు. అబద్ధాలు, ప్రచారం, డిజిటల్ కాలుష్యం అనే వరద పారుతోంది. AI ఆ వరదలో నిలబడి, అన్నింటినీ మింగి, అర్థం చేసుకుని, మానవ మెదడు కంటే వేగంగా సమాధానాలు ఇస్తుంది.
కాలంచెల్లిన చదువులు
భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని, పాత చదువులు, నైపుణ్యాలు మరణావస్థలో ఉన్నాయని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. “కష్టపడి చదువుకుని, సుఖంగా జీవించాలనే కాలం చెల్లిన నమ్మకాన్ని AI వీధిలోకి లాగి కాల్చి చంపేసింది,” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కులు, డిగ్రీలు, కంఠస్థం చేసే సామర్థ్యం కంటే, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడం, కొత్తగా ఆలోచించడం అవసరమని ఆర్జీవీ సూచించారు.
భవిష్యత్తులో కొలువుల కొరత
ఆర్జీవీ అభిప్రాయం ప్రకారం, AI ను ఉపయోగించడం నేర్పించని ఏ చదువు కూడా వ్యర్థం. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, CA, MBA వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు ‘కసాయి ఖానా’ వైపు నడుస్తున్నారని ఆయన హెచ్చరించారు. వారు చదివిన డిగ్రీలు కేవలం కాగితాలుగా మిగిలిపోతాయని, వారు చేరే ఉద్యోగాలు AI వల్ల కనుమరుగవుతాయని ఈ సందర్భంగా ఆర్జీవీ ఆందోళన వ్యక్తం చేశారు.
AI సహాయంతో ఒకే వ్యక్తి డాక్టర్, లాయర్, ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్ లాగా పనిచేయగలడని వర్మ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మానవుల కంటే వేగంగా, ఖచ్చితంగా పని చేయగలడని ఆయన చెప్పారు. మరి ఒకే రంగంలో నాలుగు, ఐదు సంవత్సరాలు చదివిన విద్యార్థి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని టెక్ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
కొత్త చదువులే ముఖ్యం
ప్రస్తుతం AI ను ఉపయోగించడం నేర్చుకోవడమే అసలైన విద్య అని వర్మ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. పాత చదువులు, కాలంచెల్లిన సిలబస్‌ను సమర్థించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీ కోర్సులో AI గురించి నేర్పించకపోతే, లేని ఉద్యోగం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. AI ను ఉపయోగించేవారిగా మారతారా? లేక AI వల్ల ఉద్యోగాలు కోల్పోతారా? అనేదే మనముందున్న ఎంపిక అని ఆర్జీవీ స్పష్టం చేశారు. “మేల్కోండి, వాస్తవాన్ని గ్రహించండి,” అని ఆయన తన ట్వీట్‌ను ముగించారు.






