సీజ్ చేసినా ఆగని పనులు.. చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

by Jakkula.Mamatha |

నాగోల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయి.

సీజ్ చేసినా ఆగని పనులు.. చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
X

దిశ, చైతన్యపురి: నాగోల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయి. నిబంధనలు అతిక్రమించి తమ ఇష్టానుసారంగా భవన నిర్మాణం చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ నాగోల్ సర్కిల్ 11లోని గోపాలకృష్ణాపురం కాలనీలోని ప్లాట్ నెం.204లో 400 గజాల స్థలంలో నిబంధనలు అతిక్రమించి స్టిల్ట్ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. ఇదంతా ఓపెన్ స్పేస్ స్థలం. ఇక్కడ నిర్మాణాలు చేయకూడదు. పర్యావరణ సమతుల్యత వలన వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండడానికి ఓపెన్ స్పేస్ కేటాయించారు. అయినా నిర్మాణం చేయడంతో నాగోల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి అనంతరం భవనం సీజ్ చేశారు. అధికారుల ను తప్పుదోవ పట్టించి సీజ్ అయిన భవనంలో నిర్మాణాలు చేస్తున్నాడు యజమాని.

టౌన్ ప్లానింగ్ మౌనం..

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసిన అదే భవనంలో తిరిగి నిర్మాణం పనులు జరుగుతున్న మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ భవనం నిర్మాణంపై ప్రజలు ప్రజాసంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు ఫిర్యాదులు చేస్తున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి. భవనం సీజ్ అయి నిర్మాణం సాగిస్తున్న యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్‌ను వివరణ కోరగా నిర్మాణం పనులు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.

Next Story